- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి పోలీస్ శాఖ డ్రైవర్లు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ, వాహనాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం. శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు వాహనాల తనిఖీ, వాహనాల డ్రైవర్లకు శిక్షణ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, డ్రైవర్లలంతా లైసెన్స్ కలిగి ఉండాలని, పోలీస్ శాఖ గౌరవం డ్రైవర్ల చేతుల్లోనే ఉందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు అతి వేగంగా వెళ్లొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ వాహనాన్ని తమ సొంత వాహనంలా చూసుకోవాలని, వాహనాలను శుభ్రంగా ఉంచి పోలీస్ శాఖ క్రమశిక్షణ ప్రతిబింబించేలా చూడాలని సూచించారు. ఘటనా స్థలానికి వెళ్లే సమయంలో, ఎస్కార్ట్, నేర పరిశోధన ప్రాంతాలకు వెళ్లే సమయంలో వాహన సామర్ధ్యానికి అనుగుణంగా నడపాలని, నిర్దేశించిన వేగం మించకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితి, ఇతర నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హైవేలపై ప్రయాణం చేసే సమయంలో 80 కిలోమీటర్ల వేగం విధిగా పాటించాలని, వాహనాల ఇంజన్ ఆయిల్, బ్రేక్, క్లచ్ అయిల్స్, కూలెంట్ అయిల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించి వాహనాల జీవితకాలాన్ని పెంచేలా చూసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ల వారిగా వాహనాలను ఎం.టి.ఆర్.ఐ పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండే వారిని గుర్తించి రివార్డులు అందజేసి ప్రోత్సాహిస్తామని, నిర్వహణ సరిగ్గా లేని వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో ఇతరుల వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ సంధర్బంగా వాహనాల నిర్వహణను సరిగ్గా చూసుకున్న వాహన చోదకులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, రివార్డు అందజేశారు. ఏఆర్.హెచ్.సీ -7 డి.ఎస్.పి ఆఫీస్ డ్రైవర్ ఎస్, శివకుమార్ గౌడ్,హెచ్.జీ -383 కొత్తకోట పోలీస్ స్టేషన్ రామాంజనేయులు, ఖిలా ఘనపూర్ పోలీస్ స్టేషన్ హెచ్.జీ -834 శ్రావణ్ కుమార్, రివార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, రాందాస్ తేజవాత్, ఏ.ఆర్.అదనపు డిఎస్పీ వీరారెడ్డి , వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు , డిసిఆర్బి డిఎస్పి, కృష్ణ కిషోర్, వనపర్తి సిఐ, నాగభూషణ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు ఎం.టి. విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు