కేంద్రగణాంకాలే ఇందుకు నిదర్శనం – మండలిలో ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని కవిత వ్యాఖ్యానించారు. 2014-15 నాటికి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 29,268 కాగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 30,022కి పెరిగింది. ఇది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిదర్శనమని కవిత తెలిపారు. 2014-15లో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,069 ఉండగా, 2023-24 నాటికి 12,126కి తగ్గిపోయింది. దీని అర్థం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ బలోపేతమైందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గుచూపారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బోధన ప్రమాణాలు మెరుగుపడటంతో ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే అవసరం తగ్గిందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యావ్యవస్థ నాశనం అయ్యిందని దుష్పచ్రారం చేసినవారికి కేంద్ర గణాంకాలే సమాధానమని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరగడం, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిపోవడం విద్యా రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనమని ఆమె అన్నారు.