-సీఎం రేవంత్ రెడ్డి
యువత వ్యసనాల వైపు వెళ్ళకుండా క్రీడల వైపు రాణిస్తే జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా కుటుంబానికి గౌరవం తెస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు కఠోరమైన శ్రమతో రాణించాలని పేర్కొన్నారు. ఇటీవలి ఒలంపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయామని, 2028 లో భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ప్రతిజ్ఞ తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
బాక్సింగ్‌లో దేశానికి తలమానికంగా క్రీడాకారిని నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని గుర్తుచేశారు.క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ఎలా ప్రోత్సహిందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు, క్రీడాకారులు హాజరయ్యారు.