- ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రతి భారతీయుడు సంఘటితంగా ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతున్న అన్నదానం చిదంబర శాస్త్రి.
అఖండ హిందూ సంఘటనా శక్తి:
ఏదైనా పని మనము సామూహికంగా ఒకే సమయాన చేస్తే అప్పుడు పుట్టుకొచ్చే ప్రకంపనల శక్తి అనంతం, అమోఘం. అలాంటిది మనము సామూహికంగా హనుమాన్ చాలీసా శ్రవణము ఒకే సమయాన చేయడంతో అద్భుతమైన సంఘటన శక్తి హిందువులలో మొదలవుతుంది. ఆ శక్తితో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా అంతకుమించి రాబోయే అనర్థాలను మొదటి దశలోనే త్రుంచి వేయవచ్చు.
ప్రతి భారతీయుడి బాధ్యత:
ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మనకు మనము నేడు చేసుకునే రక్షణ, రేపటి తరానికి ఇచ్చే శిక్షణ. సర్వేజనాస్సుఖినోభవంతు అని కోరేది కేవలం భారతదేశం మాత్రమే. ప్రపంచ శాంతి విశ్వ గురువైన భారతదేశం తోనే సాధ్యం. అలాంటి భారతదేశం శాంతిభద్రతలతో, సుఖశాంతులతో ఉండాలంటే అందులో హిందూ సంఘటన శక్తి కీలకము. ఎందుకంటే ఇతరుల బాగు కూడా కోరుకునేది మనమే కాబట్టి. ఇతర మతాలకు కూడా సముచిత గౌరవం ఇస్తూ బ్రతుకుతున్న మనము ఈ సమాజ యజ్ఞంలో పాలుపంచుకోవాల్సిందే. లేదంటే రేపటి దినం ఇతరుల క్రూర అభిమతాలకు మనము తల వంచక తప్పదు.
మన పాత పద్ధతే:
సామూహిక ఏకతా ధ్యానం లాంటివి మన పూర్వీకులు ఇదివరకు బాగా చేసేవారు. విదేశీయులు మన గడ్డపైకి వచ్చి ఆ సంస్కృతిని దెబ్బతీశారు. ఒకప్పుడు త్రికాల సంధ్య వందనం లాంటివి ఘనంగా జరిగేవి. ఒకే సమయంలో సమాజం మొత్తం ఆ దైవ స్మరణ లో నిమగ్నమవడం . ఇప్పుడు మనం చేయబోయే హనుమాన్ చాలీసా కూడా అలాంటిదే. కాకపోతే జనాల్లో శ్రద్ధ, చిత్తశుద్ధి కలగడానికి, నేటి హడావుడి జనజీవనాన్ని దృష్టిలో పెట్టుకొని మనము లౌడ్ స్పీకర్ల సహాయం తీసుకుంటున్నాం.
ఎవరికీ వ్యతిరేకం కాదు:
మనం పాటించబోయే ఈ పద్ధతి ఎవరికి వ్యతిరేకం కాదు. కేవలం మనల్ని మనము, మన సమాజాన్ని, భావి భారతదేశాన్ని ఉద్ధరించుకుంటున్నాం అంతే. ఈ యొక్క ప్రయత్నం మన ప్రభుత్వానికి మరియు పోలీసు యంత్రాంగానికి కూడా పరోక్షంగా ఎంతో ఉపయోగపడతాయి.
మహిళలు, హిజ్రాలే స్ఫూర్తి:
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో దాడి జరిగిన తర్వాత జనాల నుండి విశేష స్పందన వచ్చింది. చాలా మటుకు ఇంట్లోనే ఉండి ప్రశాంత జీవనం వైపే ముగ్గు చూపే మన మహిళలు ఈ సంఘటనను జీర్ణించుకోలేక రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం చాలా పెద్ద విషయం. చిన్న, పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి మహిళ దీనిని తీవ్రస్వరంతో ఖండించి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. అంతకు మించిన విషయం హిజ్రాల ఆక్రోషం. వాళ్లు దైవం పట్ల, ధర్మం పట్ల చూపించిన భక్తిని మనము స్ఫూర్తిగా తీసుకొని చేయి చేయి కలిపి, నిజమైన శాంతియుత సమాజం వైపు నడవాలంటే కచ్చితంగా మనమందరం ఈ యొక్క సామూహిక ఏకతా దైవారాధనతో మన సంఘటన శక్తిని పెంచుకోవాల్సిందే.
ఇలా చేద్దాం:
స్థానికులంతా ఒక అంగీకారానికి రావాలి. మన దగ్గరలో ఉన్న ప్రతి చిన్న, పెద్ద ఆలయానికి వెళ్లి అక్కడి పూజారులతో సంప్రదించాలి. దీనికి ఎటువంటి అధికారుల అనుమతి తీసుకునే అవసరం లేనటువంటి అతి సాధారణ చిన్న ప్రయత్నం. సంబంధిత పూజారులను పలానా సమయానికి తమ గుడికి చెందిన లౌడ్ స్పీకర్ లో హనుమాన్ చాలీసా పెట్టాలి అని విన్నవించాలి. మరీ అంత అవసరం అయితే ఆ లౌడ్ స్పీకర్ ను మనమే కొని గుడికి సమర్పించాలి. కొద్దికాలం పాటు అందరినీ అనుసంధానం చేస్తూ ఏకతా సమయానికి చాలీసా వినిపించేలా పర్యవేక్షించాలి.
ఇది ప్రజా ఉద్యమం :
ఈ సాత్విక ఉద్యమానికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్లు విశ్వసించి గౌరవించే పూజారులు, పీఠాధిపతులే ఈ ఉద్యమానికి సారథులు. దీనికి ఎటువంటి రాజకీయ నాయకుడు లేడు. రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరము కలిసి ముందుకు నడవాలి. జంట నగరాల్లో శ్రీరామనవమి మరియు హనుమాన్ జన్మోత్సవ పర్వదినాన శోభాయాత్రలు నిర్వహిస్తాము. అవి ఎందుకు విజయవంతమవుతున్నాయి? ఆ యాత్రలకు ఎలాంటి రాజకీయ సారథ్యం లేదు. కేవలం ప్రజల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన అది. ఆ ఆలోచన ఎంత భారీగా పెరిగిందంటే రాజకీయ నాయకులే ఆ యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలానే ఈ లౌడ్ స్పీకర్ ఉద్యమం లో కూడా ప్రజలు విశేషంగా పాలుపంచుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా మనల్ని మెప్పించడానికి వారు కూడా సామూహిక ఏకతా దైవ స్తోత్ర శ్రవణంలో పాల్గొనడానికి పోటీపడతారు. ఇది నిజం. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నది “యధా ప్రజా – తథా రాజా” కాలం కాబట్టి.
హనుమాన్ చాలీసా యే ఎందుకు?
ఏ స్తోత్రమైతే భగవంతుని ఎదురుగా కూర్చుని రచింపబడిందో ఆ స్తోత్రానికి అనంత శక్తి కలిగి ఉంటుంది. అలాంటి స్తుతే తులసీదాసు గారు ఆంజనేయ స్వామి ముందర కూర్చొని రచించిన హనుమాన్ చాలీసా.
ఆలయాలపై ముష్కరులు జరుగుతున్న దాడులతో మనకు తెలియకుండానే ఒక అభద్రతాభావములోకి వెళ్ళిపోతున్నాము. దీన్ని ఇలానే వదిలేస్తే రేపటి దినం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. ఆ భయాన్ని పారద్రోలేందుకు మనకు ధైర్యం కావాలి. హనుమాన్ చాలీసా వినడానికి మనకు ప్రత్యేకమైన నియమాలు మడి పాటించాల్సిన అవసరం లేదు. పరిచయం అక్కర్లేనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ స్తోత్రం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ సులువైనటువంటి అతి తక్కువ సమయం తీసుకునే అతి శక్తివంతమైన స్తోత్రము ఇది.
ఆలయాలపై దాడి అంతర్జాతీయ వ్యూహం?
మన దేశంలో ఆలయాలపై తరచూ జరుగుతున్న సంఘటనలు కేవలం యాదృచ్ఛికమో లేక స్థానిక పరిస్థితులో కాదు. ఇదొక పెద్ద వ్యూహం. భయంకర భావి భారత చీకటి సామ్రాజ్యానికి పడుతున్న అడుగులుగా అనుమానం వస్తున్నది. అయినప్పటికీ దీనికి ఒకటే ఒక్క మందు. అదే హిందూ సంఘటన శక్తి. ఈ శక్తి సూర్యుని వలె నిశ్శబ్దంగా, శాంతియుతంగా చీకట్లను చీల్చి చెండాడుతుంది. ఆ శక్తిని గనక మనము ఇప్పుడు పోగు చేసుకోకపోతే మనపై దుష్టశక్తి విజయం సాధిస్తుంది. మనపై సరే, రేపటి మన తరం లేకుండా చేస్తుంది. అలాంటి భారతావని కోరుకో కూడదు, చూడవద్దు అని అనుకుంటే మనమందరం తప్పకుండా ఇప్పుడు హిందూ సంఘటన శక్తిని పెంచి పోషించుకోవాల్సిందే. ఇది కుల మతాలకతీతంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం. యుద్ధాన్ని ఆపే ఉద్యమం. మన ఇంట్లో వాళ్లని, తోబుట్టువులను, పిల్లలను, తల్లిదండ్రులను అన్నిటికంటే ముఖ్యంగా దేశ సంపద మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. మన భావితరాలకు ఒక భద్రమైన జీవితాన్ని అందించాలంటే మనమందరం ఈ సంఘటన శక్తిని తెచ్చుకోవాల్సిందే. లేదంటే మన బంగారు భవిష్యత్తును తెంచుకోవాల్సిందే.
ముఖ్య గమనిక:
పది వేర్వేరు ప్రాంతాల్లో తవ్వితే భావి ఏర్పడదు. పదిమంది కలిసి ఒకే ప్రాంతంలో తవ్వితేనే బావి తయారవుతుంది. అలాంటి ఆలోచన మరియు ప్రయత్నమే ఈ సామూహిక ఏకతా కాలంలో చేసే హనుమాన్ చాలీసా. గుడులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని మనలో లోపించి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఆధ్యాత్మికవేత్తలను సంప్రదించి, ఎంతో లోతైన విశ్లేషణ చేసి అందిస్తున్న విషయం ఇది. “ఎవరు గానం చేసిన హనుమాన్ చాలీసా పెట్టాలి”, “ఏ నిర్దిష్ట సమయానికి పెట్టాలి” అనేటిది త్వరలోనే మనమందరం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుందాం.
ధర్మో రక్షతి రక్షితః