Sunday, September 7, 2025
spot_img

సకల మంత్రాలకు మూలశక్తి.. గాయత్రి

Must Read

జ్యేష్ట శుక్ల ఏకాదశి గాయత్రి జయంతి

వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన దినమైన జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. గాయత్రి మాత ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది.అవి.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు ఉంటారని వివరించబడింది.

గాయత్రికి మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదన్నది దివ్యసూక్తి. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గయలు’ అనగా ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రి అనే పదము ‘గయ’, ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉంది. “గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తన భాష్యములో వివరించారు. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే.

గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు. గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును. ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు. ఇరవై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి నాలుగు పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ ఋగ్యజుస్సామ వేదాల నుండి, నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు.

మొదటి మూడు పాదాల్లో ఐరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యస్తమయం కంటె ముదుగాను అచరించాలని పెద్దల ఉవాచ. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసనవల్ల అనంతమైన సత్ఫలితాలను పొందగలరని సంప్రదాయ ఆచరణా సక్తుల విశ్వాసం.

రామకిష్టయ్య సంగనభట్ల

9440595494

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This