- దాహమేస్తే డబ్బులు పెట్టీ బాటిల్ కొని తాగల్సిందేనా..?
- సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు తప్పని దాహార్తి కష్టాలు
ఎక్కడో గ్రామాలలో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా ఆయా గ్రామాలలో చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ వికారాబాద్ జిల్లా పెద్దసారు కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్య ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మాలి. అది నిజం కూడా. వికారాబాద్ జిల్లా 19 మండలాల నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి పనుల నిమిత్తం రైతులు వందలాదిమంది వస్తుంటారు. అయితే వచ్చిన ప్రజలకి త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. కానీ సమస్యలు చెప్పుకునేందుకు ఆఫీసుకు వచ్చే అర్జీదారులకు తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కి పైగా ప్రభుత్వ శాఖలు సమీకృతమై ఉన్నాయి. కానీ వీరందరికీ ఈ కలెక్టరేట్‌లో గుక్కెడు నీళ్లు దొరకడం లేదు మరుగుదొడ్ల వినియోగానికి బోర్ నీటిని వినియోగించుకుంటున్నప్పటికీ తాగునీటికి మాత్రం కటకట ఏర్పడుతోంది. అయితే బయటి నుంచి టిన్నులు తెచ్చుకునే క్రమంలో కొంచెం ఆలస్యం జరిగినా ఆ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు గొంతెండుతున్న పరిస్థితి. కార్యాలయాలకు వచ్చే ఇతర ప్రముఖులకు కూడా సకాలంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. అత్యవసరమైతే క్యాంటీన్‌కు వెళ్లి తాగాల్సిన దుస్థితి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే దాహమేస్తే డబ్బులు పెట్టి బాటిల్లు కొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. 20 రూపాయలు బాటిల్ కొనుక్కొని తాగితే తప్ప దాహమారని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.