Wednesday, August 13, 2025
spot_img

ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని అనిశెట్టి రజితకు నివాళి

Must Read

తెలుగు సాహిత్య లోకంలో ఒక ధిక్కార స్వరం మూగబోయింది. ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని, రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో ఆగస్ట్ 11, 2025న వరంగల్‌లో మనలను శాశ్వతంగా విడిచిపోయారు. ఆమె లేని లోటు కేవలం ఒక వ్యక్తి నష్టం మాత్రమే కాదు, తెలంగాణ సాహిత్యం, ఉద్యమాలకు, స్త్రీవాద భావనలకు తీరని లోటు. రజిత జీవితం ఒక స్ఫూర్తి దాయకం. శ్రమజీవుల పక్షాన నిలిచి, అణచివేతలకు వ్యతిరేకంగా కలం పట్టిన యోధురాలు. ఆమె రచనలు సామాజిక అసమానతలను ఎధిరిస్తూ, ప్రశ్నిస్తూ, మానవత్వాన్ని ప్రకటిస్తాయి.

అనిశెట్టి రజిత 1958 ఏప్రిల్ 14న వరంగల్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆకాశవాణి ద్వారా తెలంగాణ ఉద్యమ సంఘర్షణలు, కవి సమ్మేళనాలు, దాశరథి, ఆరుద్ర వంటి మహనీయుల ఉపన్యాసాలకు ఆకర్షితులయ్యారు. 1969లో తొమ్మిదో తరగతి చదువుతుండగానే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసి, ప్రజలను ఉద్యమం వైపు మళ్లించారు. ఈ అనుభవాలు ఆమె రచనల్లో ప్రతిబింబిస్తాయి. 1973లో ఇంటర్ చదువుతున్నప్పుడు ‘చైతన్యం పడగెత్తింది’ అనే తొలి రచనతో సాహిత్య విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె జీవితం ఉద్యమం మరియు సాహిత్యం మధ్య సమన్వయంతో సాగింది. ఒక చేత్తో ఉద్యమ జెండా, మరో చేత్తో కవిత్వ పతాక చేపట్టింది.

అనిశెట్టి రజిత రచనలు సామాజిక యథార్థాలను స్పృశిస్తాయి. ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ ఉద్యమ అనుభవాల నుంచి జన్మించింది. అందులో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిధ్వనిస్తాయి. ‘నేనొక నల్లమబ్బునవుతా’ స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో రూపుదిద్దుకుంది. మహిళల అణచివేతలను విమర్శిస్తుంది. ‘చెమట చెట్టు’, ‘ఓ లచ్చవ్వ’, ‘ఉసురు’, ‘గోరంత దీపాలు’, ‘దస్తఖత్’, ‘అనగనగా కాలం’, ‘మట్టి బంధం’, ‘నన్హే ఓ నన్హే’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’, ‘నిర్భయాకాశం కింద’ వంటి సంపుటాలు ఆమె సాహిత్య పిపాసను చాటుతాయి. హైకూల సంపుటి, ఆచార్య పాకాల యశోదా రెడ్డిపై మోనాగ్రాఫ్ కూడా రాశారు. మొత్తం 500కి పైగా కవితలు, 100కి పైగా వ్యాసాలు, 30కి పైగా పాటలు రచించారు. ఆమె సాహిత్యం కేవలం కళాత్మకం కాదు, సామాజిక మార్పుకు సాధనం. స్త్రీవాదం, దళిత ఉద్యమాలు, తెలంగాణ గొంతుకలు ఆమె రచనల్లో మిళితమవుతాయి. ఉదాహరణకు, ‘నిన్ను నీవు వదులుకున్న రోజు’ కవితలో ఆమె ఇలా అంటారు: “నిన్ను నీవు వదులుకోని రోజు/ ఎవరిని ప్రేమించలేవు/ బతికున్న శవంగానే మిగిలిపోతావు”. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రేమ మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తుంది, మానవత్వాన్ని హృదయానికి దగ్గర చేస్తుంది.

ఆమె వ్యక్తిత్వం స్నేహశీలి, సాదాసీదా. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ అధ్యక్షురాలిగా, సాహిత్య సమావేశాల్లో ఆమె మాటలు యువ రచయితలను ప్రేరేపిస్తాయి. ఆమె సాహిత్యం మట్టి బంధం లాంటిది – సమాజం పట్ల బాధ్యతావంతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు: 2014లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, 2016లో అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం. ఆమె రచనల్లో స్త్రీవాదం ప్రబలంగా కనిపిస్తుంది. ‘ధిక్కారం’ కవితలో: “ఇక నీ ఆటలు సాగనివ్వం/ నీ తోకను ముడువకుంటే/ నీ పీకను వధ్యశిలపై పెట్టు/ నరకటానికి సిద్ధంగా ఉన్నాం/ ఖబడ్దార్‌! మృగాధిపత్యమా”. ఇది పురుషాధిక్యతపై ధిక్కారం, స్త్రీల శక్తిని ప్రకటిస్తుంది. ఆమె సాహిత్యం మానవత్వాన్ని ఉద్దీప్తం చేస్తుంది – పీడితుల పక్షాన నిలిచి, సమానత్వం కోసం పోరాడుతుంది.

రజిత మానవత్వం ఆమె చర్యల్లో ప్రతిఫలిస్తుంది. గతేడాది శరీర దానం అంగీకరించి, మరణానంతరం నేత్రదానం చేసి, భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఇది ఆమె సదాశయానికి నిదర్శనం. ఆమె రచనలు కేవలం పదాలు కావు, జీవిత దర్శనం. ‘ఆఖరి మగాడు’లో: “మేము ఊరుకోము, మనుస్మృతుల అగ్నికీలల్లో కాలము.. కదంతొక్కుతాం” / “ఈ యుద్ధంలో సమిధలై/ ఆఖరి మొగాళ్లుగా.. నిలుస్తారో… మీ ఇష్టం! / ఆడవాళ్ళు పువ్వులే కాదు… అగ్నిశిఖలని మరువకండి!”. ఇది స్త్రీలను అగ్నిశిఖలుగా చిత్రీకరిస్తూ, మార్పుకు పిలుపునిస్తుంది. ఆమె సాహిత్యం సమకాలీన సమస్యలను స్పృశిస్తుంది. లింగ అసమానతలు, వర్గ భేదాలు, పర్యావరణం వంటివి.

మొత్తంగా.. రజిత సాహిత్యం ప్రజా పక్షపాతమే. ఆమె కవిత్వం కాకి బంగారం కాదు, అది జీవితాన్ని మార్చే ఆయుధం. స్త్రీవాద ఉద్యమంలో ఆమె రచనలు మహిళల చైతన్యాన్ని పెంచాయి. మానవత్వ దృక్పథం ఆమెలో సహజంగా తోటి మనుషుల బాధల్లో తనను తాను చూసుకునేది. ‘నేను అనంతమయిని’లో: “నన్ను గుప్పిట బంధించాలని చూడకు/ అదృశ్యరూపంలో ఉన్న అనంతమయిని/ పుష్పవికాసాన్నే కాదు/ విశ్వప్రళయాన్నీ చూస్తావు”. ఇది స్త్రీ శక్తిని అనంతంగా చూపిస్తుంది.

అనిశెట్టి రజిత మరణం తెలుగు సాహితీలోకాన్ని దుఃఖసాగరంలో ముంచింది. ఆమె రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి,బంధు, మిత్రులకు, సాహితీ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. రజిత లాంటి యోధురాళ్లు మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తారు.

  • డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్, 9849328496.
Latest News

కీచ‌క ఎస్సై.. లైంగిక వేధింపులు

మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సైపై చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పట్నం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్‌పై ఒక గిరిజన మహిళ లైంగిక...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS