- తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట తదితర ఉన్నతాధికారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, అధికారులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా సేవలను వివరించారు. ఈ సంధర్బంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రానున్న కాలంలో ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, రాష్ట్రంలో సంబంధిత యూనిట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు, నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సంబంధిత సేవలు తెలంగాణలో అవసరం ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పెట్టుబడులతో తరలిరావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో తోషిబా సేవలు అవసరం అవుతాయని వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు తోషిబా అధికారులు స్పందిస్తూ, భారతదేశంలో తాము కేవలం మూడు రాష్ట్రాల్లోనే తమ యూనిట్లను ప్రారంభించమని తెలిపారు.వీటిలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖమైందని,రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సానుకూలంగా ఉన్నామని అధికారులు తెలిపారు.