సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నరని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులతో కలిసి హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, బాధితులకు రక్షణ కవచంలా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని, బాధితులంతా తమ కుటుంబసభ్యులేనని తెలిపారు. మూసీ నది పై పేదల ఇళ్లను కూల్చి,పెద్ద భవనాలకు అనుమతులు ఇస్తున్నరని ఆరోపించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలి కాని, గోసలు ఉండకూడదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేసే అంశంపై దృష్టి సారించాలని వ్యాఖ్యనించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే మూసీపై ముందస్తుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లిలో బుచ్చమ్మది ఆత్మహత్య కాదని,రేవంత్ రెడ్డి చేసిన హత్యని విమర్శించారు.