కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి వంగపూడి అనిత తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొలుకోలేక మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అనిత హామీ ఇచ్చారు.
కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికను నిందితుడు గతకొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. శనివారం కూడా నిందితుడు ఫోన్ చేసి కలుద్దామని చెప్పడంతో, బాలిక అతను చెప్పిన చోటుకి వెళ్ళింది. నిందితుడు బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్ళి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బాలిక కేకలు వేయడంతో, పొలాల్లో పనిచేస్తున్న రైతులు వచ్చి మంటలు అర్పి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.