- ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత
- ఓటమి భయంతో వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు
- ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి
పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి అన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడుతూ.. ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వెల్లడించారు. మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రీజనల్ కాన్ఫరెన్స్లో మంత్రి డోల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. వైసీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు దాదాపుగా రూ.100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. 154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఈరోజు పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేక రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 35శాతం ఓటింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారని అంటున్నారని.. మరి టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు కదా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఉద్ఘాటించారు. వైసీపీ లాగా తాము ధర్నాలు గొడవలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి పులివెందులలో ఉప ఎన్నిక ప్రశాంతంగా నడుస్తోందని… ఈ ఎన్నికలో కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
చట్టాన్ని గౌరవించాలని… ఏకపక్షంగా రాజకీయం చేయటాన్ని ఎవరూ ఉపేక్షించరని హెచ్చరించారు మంత్రి డోల వీరాంజనేయ స్వామి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వినూత్నమార్పులు తెస్తున్నామని నొక్కిచెప్పారు. పిల్లలకు వసతి, చదువు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన బియ్యం ఇచ్చే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ మరువలేనిదని ఉద్ఘాటించారు. రూ. 143 కోట్లతో హాస్టళ్లను రిపేర్లు చేయిస్తున్నామని.. హాస్టళ్లకు రూ.100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని గుర్తుచేశారు. హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఎవరూ తక్కువ కాదని అన్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడిరచారు. వార్డెన్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వర్క్ షాప్లో చర్చిస్తామని మంత్రి డోల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.