- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ పేరుతో మారంగంటి రాజేందర్ రెడ్డి, మారంగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం
- బ్యాంక్లరను మోసగించిన బడా మోసగాళ్లు..
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సరికొత్త మోసం
- సర్వే నెం.584కి బదులు 581/1ని చూపిన వైనం
- సర్వే నెం.581/1లో ప్రభుత్వ భూమిగా తేటతెల్లం
- ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు
- రూ.8కోట్లు తీసుకొని ఎగ్గొటిన మారంగంటి కుటుంబ సభ్యులు
- ప్రభుత్వ భూమిని వేలం వేసిన యూనియన్ బ్యాంక్
- వేలంపాటలో దక్కించుకున్న కల్కి స్పిరుట్యువల్ వెల్ఫేర్ ట్రస్టు
- కల్కి స్పిరుట్యువల్ వెల్ఫేర్ ట్రస్టును సైతం మోసం చేసిన బ్యాంక్
- సర్కారు భూమిని స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూ యంత్రాంగం..!
‘ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆంబోతుగా ఆరునెలలు బతికినా చాలు’ అంటారు పెద్దలు. కానీ కొందరు మోసగించడమే పనిగా పెట్టుకొని ఎప్పుడూ ఎవర్నో ఒకర్నీ మోసంచేసి డబ్బు, భూమి కొట్టేద్దామని చూసేవాళ్లు భూమి మీద చాలా మందే ఉన్నారు. అసొంటోళ్లనే చాలా మంది ఈజీగా నమ్మేస్తారు. లేకుంటే డబ్బుచ్చి నమ్మేలా చేస్తారు అదీ వేరే విషయం అనుకోండి. తెలంగాణలో మోసకారులు ఎక్కువై పోయారు. వాళ్లకు చెందని వాటిని సొంతవిగా చెప్పుకొని అమ్మేసేవారు కొందరైతే తనదే నంటూ నమ్మబలికి తనఖా పెట్టేవారు మరికొందరు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసే వారు బోలెడు మంది ఉన్నారు. గొర్రె కటిక వాడినే నమ్ముతుంది అన్న చందంగా లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వారినే బ్యాంకులు నమ్మి రుణాలు ఇస్తాయి. అలాంటి సరికొత్త వారి చరిత్రనే ఇదీ.. సర్వే నెంబర్ 581/1లోని 3630 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమాజిగూడ బ్రాంచ్‌లో రూ.ఎనిమిది కోట్లను కీ.శే. మారంగంటి గోపాల్ రెడ్డి, కీ.శే.మల్లమ్మ, మారంగంటి రాజేందర్ రెడ్డి, మారంగంటి ప్రవీణ్ రెడ్డి, మారంగంటి సుచిత్రారెడ్డి, మారంగంటి సుమితా రెడ్డి పేర్లు మీద మార్టిగేజ్ లోను తీసుకోవడం జరిగింది. వీరు ఎంజిఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కానీ, దానిని రిజిస్టర్ చేయించలేదు. ఆ తర్వాత కీ.శే. గోపాల్ రెడ్డి, కీ.శే. మల్లమ్మ స్థానంలో ఎం. సుచిత్రారెడ్డి, ఎం.సుమితారెడ్డిలను సంస్థలో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ గా తీసుకున్న రూ.8 కోట్లను ఎగ్గొట్టడం జరిగింది. వాస్తవానికి వీళ్లు తనాఖా పెట్టిన భూమి కూడా వీరిది కాదు.. వీరిది సర్వే నెం. 584లో ఉంటది. ఈ మాత్రం సోయిలేకుండా నాది కాదు నా అత్త గారు సొమ్ము అన్నట్టుగా వ్యవహరించారు బ్యాంకర్లు.

పేద, మధ్య తరగతి వారికి ఓ లక్ష రూపాయల లోన్ కావాలంటే బ్యాంకు అధికారులు ముత్తాతల కానుంచి ఆస్తులు, వాటి వివరాలు, డాక్యుమెంట్లు, పట్టా బుక్కులు ఇసొంటివి బోలేడన్ని అడిగి ఓ నెల రోజులు తిప్పించుకొని చివరకు లక్ష రూపాయల లోన్ శాంక్షన్ చేస్తారు. అదే బడాబాబులకైతే కనీసం ఓ ఆధార్ కార్డు, ఫోటో కూడా తీసుకోకుండా ఇట్లనే డబ్బు ఇచ్చేస్తారు. కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొటి పోయే వాళ్లైతేనే వీళ్లకు కరెక్ట్. రీజన్ ఏంటంటే.. అసోంటి వాళ్లు వీరు అడిగినంత డబ్బు మాముళ్లుగా ఇస్తారు కాబట్టి. కానీ, ఎవరికైనా బ్యాంక్ లోన్ కావాలంటే బంగారం, లేదా భూమి తాకట్టు పెట్టుకొని ఇస్తారు. బంగారం అయితే అదీ ఎంత ధర ఉంటుంది, తరుగు ఎంత, అదీ అసలుదా, నకిలీదా అని నిర్ధారించుకున్న తర్వాతే లోన్ ఇస్తాయి బ్యాంకులు. ఇక భూమి తాకట్టు అయితే భూమి కాగితాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని, నిజంగా సదరు భూమి ఇతనిదేనా అని బ్యాంకర్లు లోన్ ఇచ్చేముందు ఫీల్డ్ లోకి వెళ్లి సరిహద్దులు చూసుకొని, ఊరు, ఇరుగు పొరుగు వారిని ఎంక్వైరీ చేసి లోన్ మంజూరు చేస్తారు. ఆ భూమి వ్యాల్యూ ఎంత ఉంటుందో దానిలో ఓ 50శాతం వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది.
కానీ అసొంటివి ఏం చూడకుండా వీళ్ల భూమి సర్వే నెం 584 అయితే సర్వే నెం.581/1ను ఇదీ మాదే అని చూపి కోట్ల రూపాయలు అడగ్గానే యూనియన్ బ్యాంక్ వారు ఏ మాత్రం చూసుకోకుండా గుడ్డిగా రూ. 8 కోట్లు లోన్ మంజూరు చేసింది. అయితే ఈ బ్యాంక్ నుండి రుణం పొందడానికి అప్పటి బ్యాంక్ అధికారులు ఎస్.వి సుబ్బారావు, ఎం. సూర్యపవన్, ఇతర అధికారులు వారి నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని రుణం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండలం, గ్రామం ఉప్పల్ ఖల్సా, సర్వే నెంబర్ 584లో వీరికి పట్టా భూమి ఉన్నది. ఇది వీరి స్వంత భూమి. కానీ బ్యాంక్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి, సర్వే నెంబర్ 581/1 ప్రభుత్వ భూమిని అధికారులకు చూపి రూ.8,00,00,000/- లు బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 8180/2010. బ్యాంక్ అధికారులకు బురిడీ కొట్టించి తప్పుడు డాక్యుమెంట్లతో రుణం పొంది అట్టి రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టాలనే దురుద్దేశ్యంతో రుణం పొందడం జరిగింది. అందులో భాగంగానే ఆ వ్యక్తులు బ్యాంక్ కు రుణం చెల్లించకుండా ఎగొట్టారు. అయితే ఇదే విషయమై బ్యాంక్ అధికారులు అనేక మార్లు వారికి రుణం చెల్లించడానికి నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. అంతేకాకుండా బ్యాంకుకు వెళ్లి కూడా ఎలా సమాధానం చెప్పకపోవడం గమనార్హం. లోన్ డబ్బుల కోసం బ్యాంక్ అధికారులు తిరిగి తిరిగి ఇక చేసేదేంలేక బ్యాంక్ అధికారులు సర్వే నెంబర్ 581/1లోని భూమిని వేలంకు పెట్టడం జరిగింది. వేలం పాటలో కల్కి స్పిరుట్యువల్ వెల్ఫేర్ ట్రస్టు అనే సంస్థ పాల్గొని దక్కించుకుంది. అట్టి భూమిని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.కవిత తండ్రి: బి.కృష్ణముడు డబ్బులు కట్టి కొనుగోలు చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 15939/2016. కానీ, పాపం వీళ్లు కొన్నది ప్రభుత్వ భూమి అని తెలియదు. ఈ నేపథ్యంలోనే వాళ్లు భారీ మోసానికి గురయ్యారు.
బ్యాంక్ వేలం వేసిన స్థలం ప్రభుత్వానిది కావడం వలన అట్టి భూమిని స్వాధీన పర్చుకోవడానికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవడం జరిగింది. కావున దీనిపై మీరు సమగ్రమైన విచారణ చేపట్టి తప్పుడు పత్రాలతో రుణం ఇచ్చి న బ్యాంక్ మేనేజర్ అదేవిధంగా వీరికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అలాగే బ్యాంక్ ను మోసం చేసిన ఎం.రాజేందర్ రెడ్డి, ఎం.ప్రవీణ్ రెడ్డి, ఎం.సుచిత్రారెడ్డి, ఎం.సుమితా రెడ్డిలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి ఆ లోన్ అమౌంట్ రికవరి చేసి తెలియక ప్రభుత్వ భూమిని వేలంలో దక్కించుకున్న కల్కి స్పిరుట్యువల్ వెల్ఫేర్ ట్రస్టు కు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.
ఈ ఘరానా మోసంపై ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక బ్యాంక్ మేనేజర్‌కు, బ్యాంక్ డిప్యూటీ జనరల్‌మేనేజర్‌కు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కేంద్ర కార్యాలయం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.