- ప్రిస్టేజ్, వైష్ణోయి గ్రూపులను కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా..?
- నల్ల వాగు కిలోమీటర్ నర పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉండేది..
- మొత్తం పూడ్చేసి.. ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం
- మర్రివానికుంట రెండు ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేసేశారు..
- మర్రివానికుంట నుండి జల్‌పల్లి చెరువుకు వెళ్లే నల్ల వాగును పూడ్చేశారు..
- పార్కులు, రోడ్లు, ప్రజా ఉపయోగ స్థలాలను సైతం కబ్జా
- గేటెడ్ కమ్యూనిటీ విల్లాల నిర్మాణం అంటూ ఊదరగొట్టారు..
- ఈ అవినీతి, అక్రమాలపై బడంగ్‌పేట్ కమిషనర్ నోటీసులు పంపిస్తే బెదిరింపులు..!
- హైడ్రా రంగనాథ్, బడంగ్‌పేట్ మున్సిపల్ ప్రత్యేక కమిషనర్ చోద్యం చూస్తున్నారా:. ?
- మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి…!
ప్రిస్టేజ్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైష్ణోయి గ్రూప్స్ .. ఇద్దరూ తోడు దొంగలు.. వీరికి ప్రభుత్వం అంటే లెక్కలేదు.. అమాయక ప్రజలను హీనంగా చూస్తారు.. ఇక రైతులను నట్టేట ముంచుతున్నారు.. ఎన్నని చెప్పాలి.. ఏమని చెప్పాలి..? వీరికి ఎలాంటి తగినన్ని అనుమతులు వుండవు.. ఒకవేళ అనుమతులు తూ తూ మంత్రంగా తీసుకున్నా వీరు నిర్మాణాలు అక్రమాలకూ నిలమైపోయాయి.. నీటి కుంటలు, వాగులు, వంకలు, రహదారులు, పార్కులు, పబ్లిక్ స్ధలాలు అడ్డగోలుగా కబ్జా చేసేశారు.. వాస్తవాలు తెర్లుసుకుని ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తారు.. ఏకంగా లోకల్ మున్సిపాలిటీ అయిన బడంగ్ పేట్ కమిషనర్ వారికి నోటీసులు పంపిస్తే బెదిరింపుల పర్వానికి దిగుతున్నారు.. అంటే వీరు ఏస్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు సామాన్యులు కూడా కాదు.. పేరున్న ప్రముఖులే.. తమకు ప్రాణ భయం ఉందని నెత్తి నోరు కొట్టుకుంటున్న అధికారులెవరూ పట్టిన్చుకున్న పాపానపోలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో వీరి వెంచర్లలో ఆస్తులు కొనుగోలు చేసిన అమాయకుల పరిస్థితి ఏమిటి..? అడగడానికి సాహసించగలరా..? ఒకవేళ అడిగితే ప్రాణాలతో వుంటారా..? ఇలాంటి వారిని ఖచ్చితంగా అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్తలు.. అసలు వీరి వెనుక ఎవరున్నారు..? ఇంతగా బరితెగించడానికి ధైర్యం ఎలా వచ్చింది..?






ఒక గొప్ప పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ సంస్థ.. ఈ సంస్థకు దేశమంతటా ప్రముఖ నగరాల్లో కార్యాలయాలున్నాయి.. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో 8 ప్రాజెక్టులు చేస్తోంది.. ఇలా వందల సంఖ్యలో పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టి సామాన్యులకు, సంపన్నులకు ఇళ్లను నిర్మించి అందించడం వీరి యొక్క వ్యాపారం.. ఈ క్రమంలో ఇంత పెద్ద సంస్థ అవినీతికి పాల్పడింది.. ఈ ప్రిస్టేజ్ సంస్థకు మరొక బడా సంస్థ వైష్ణోయి జతకట్టింది.. ఇంకేముంది వీరు జతగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.. ప్రభుత్వ ప్రాపర్టీతో బాటు రైతులకు బాసటగా నిలుస్తున్న నీటి కుంటలు, కాలువలను సైతం దౌర్జన్యంగా కబ్జా చేసి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిస్సంకోచంగా కొనసాగిస్తున్నారు.. వివరాలు ఆధారాలతో సహా అందించాం.. మరోసారి మీముందుకు తీసుకుని వస్తున్నాం..
బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండల్ రెవెన్యూకు సంబంధించి మామిడిపల్లి గ్రామం సర్వేనెంబర్స్ : 111, 112, 113, 115, 117/1, 117/2, 117/3, 118/3, 119, 122 గల స్థలంలో.. ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థలు సoయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టింది.. దీనిని ఎవరూ కాదనలేదు.. కానీ వీరి అవినీతి బయటపడడంతోనే అసలు కథ చెప్పాల్సి వస్తోంది..
అయితే ఇక్కడ జరిగిన దారుణమైన అక్రమం ఏమిటంటే “మర్రివానికుంట” విస్తీర్ణం రెండు ఎకరాలను పూర్తిగా చదును చేసి, అక్రమ పద్ధతిలో వెంచర్ చేశారు.. ఈ విషయంపై హైడ్రా ప్రత్యేక దృష్టిసారించాలని స్థానిక జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రెస్టేజ్ గ్రూప్ సంస్థ 40 ఎకరాలలో తీసుకున్న హెచ్ఎండిఏ అనుమతుల ప్రకారం కాకుండా.. పబ్లిక్ ఓటిలిటీ స్థలాలు, పార్కులు రోడ్లు అన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకుని వెంచర్ చేసి ప్లాట్లు చేశారని స్థానిక మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది.. దీనికి ఫలితంగా సదరు సంస్థల యాజమాన్యం ఏకంగా కమిషనర్ పైనే బెదిరింపుల పర్వానికి దిగుతున్నారని తెలుస్తోంది.. ఈ విషయంపై.. మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సాధించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి..
ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థ సయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి నుండి లేఅవుట్ అనుమతులు తీసుకొని, గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు తీసుకోకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి, పార్కు స్థలాలను రోడ్లను ప్లాట్ లు గా చేసి అవినీతికి పాల్పడి గేటెడ్ కమ్యూనిటీలా ప్రకటనలు గుప్పించి, ప్రభుత్వానికి కోట్లల్లో పన్ను ఎగవేయడం జరిగింది.. ఈ విషయంపై స్థానిక మున్సిపాలిటీ బడంగ్పేట్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చారు.. కానీ నోటీసులు ఇవ్వడంతో అటువైపు నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోవడం జరుగుతోంది.. అందుకే కమిషనర్ అటువైపు కూడా కన్నెత్తి చూడటానికి సైతం భయపడుతున్న పరిస్థితి నెలకొంది..
ఇక వీరిపై పోరాటం సాగిస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి.. కథ వేరేగా వుంది.. ప్రిస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్స్ వారు దౌర్జన్యకాండకు దిగుతున్నారు.. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేస్తారా..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి..? ఏదైర్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..? ఇలాంటి దుర్మార్గులను ఎవరు వెనుక నుండి నడిపిస్తున్నారు..? అమాయకుల జీవితాలతో ఆడుకునే హక్కు వీరికి ఎవరు కల్పించారు.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
దారుణంగా నీటి కుంటలను, పార్కులు, రోడ్లు పబ్లిక్ స్ధలాలు కాజేసిన ఇలాంటి సంస్థలను నిలువరించకపోవడం దురదృష్టకరం.. హైడ్రా లాంటి ప్రభుత్వ రంగ సంస్థ దూకుడుకా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వారు భయపడకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతుండటం దేనికి సంకేతం..? ఈ సంస్థల యాజమాన్యం విసిరేసిన ఎంగిలి మెతుకులకు ఏమైనా ఆశపడుతున్నారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి..
ఇదే విషయంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే పెద్దవారు ఉన్నారు మా ఉద్యోగాలు ఉడుతాయని జవాబు ఇవ్వడం కొసమెరుపు.. ఈ అవినీతి అక్రమాలలో ఎవరి వాటా ఎంత అనే విషయం.. ఉన్నతాధికారులకు అందిన వాటాలు ఎంత అన్నది లోతైన పరిశోధన చేసి.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే సర్వేనెంబర్ 141 లో ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు రెండు ఎకరాలు ల్యాండ్ కబ్జా చేసి ప్లాటింగ్ చేయడం జరిగింది.. అంతేకాకుండా నల్లవాగు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొత్తచెరువు, మర్రివాని కుంట నుండి జల్పల్ చెరువులకు పోయే నీటి వాగు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి.. సర్వే నెంబర్ 32 హనుమాన్ దేవాలయం భూమి కబ్జా చేసి వెంచర్ కు రోడ్డు వేయడం జరిగింది.. 32 నెంబర్ సర్వేనెంబర్ 1-20 భూమి రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది.. 2013లో రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి మీద చేయడం జరిగింది. ఇది దేవాలయం భూమి.. సర్వేనెంబర్ 10 మామిడిపల్లిలో వైష్ణోయి గ్రూప్ కబ్జా చేయడం జరిగింది.. దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేశారు.. ఈ విషయం పై కంప్లైట్ ఇస్తే బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారని అనిపిస్తుంది.. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు, హైడ్రా లాంటి ప్రెస్టీజియస్ సంస్థ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.. హైడ్రా రంగనాథ్ వెంటనే యాక్షన్ లోకి దిగి వీరి పని పడతారని.. తగిన న్యాయం చేసి అమాయకులను కాపాడతారనే ఆశిద్దాం..