Friday, August 8, 2025
spot_img

ఖజానాకు సున్నం… అధికారులకు బెల్లం..

Must Read
  • పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం
  • సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు
  • పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్
  • చట్టపరమైన చర్యలకు డిమాండ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార యంత్రాంగం, కొన్ని ప్రముఖ సంస్థల మధ్య కుమ్మక్కు జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కుంభకోణం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టడమే కాకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును బయటపెట్టింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నులను ఎగవేసేందుకు అధికారులు, సంస్థలు కుమ్మక్కయ్యారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘ఆదాబ్ హైదరాబాద్’ పూర్తి ఆధారాలతో వార్తా కథనాన్ని ప్రచురించింది. అయినా పోచారం మున్సిపాలిటీ కమిషనర్‌లోగానీ, పన్ను మదింపు విధానంలోగానీ ఎలాంటి మార్పు లేకపోవడం శోచనీయం.

పన్ను ఎగవేతలో భారీ అవకతవకలు
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ, సీవీఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నీలిమ హాస్పిటల్‌లు గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య పౌరుడు ఒక్క సంవత్సరం పన్ను చెల్లించకపోతే అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుండగా, ఈ సంస్థలు మాత్రం కోట్లాది రూపాయల పన్నులను ఎగవేసినా అధికారుల నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు, సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లిస్తున్నాయని సమాచారం. 2024 సెప్టెంబర్‌లో పోచారం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా పన్నులు మదింపు చేయకుండా పాత, అతి తక్కువ పన్నులనే కొనసాగించడం ఈ కుంభకోణంలో అధికారుల సహకారం ఉందనడానికి స్పష్టమైన సూచన అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు
ఈ కుంభకోణంలో స్థానిక ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆయన ఈ సంస్థలకు పన్ను ఎగవేతలో సహకరించారని విమర్శిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన ఈ దోపిడీని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
పోచారం మున్సిపాలిటీ కమిషనర్‌పై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా పన్నుల మదింపు చేయకుండా పాత పన్నులనే కొనసాగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, కళాశాల యాజమాన్యం మధ్య ‘చీకటి ఒప్పందం’ జరిగి ఉండవచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల జీతం పొందుతూ, ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం క్షమించరాని నేరమని వారు అంటున్నారు.

చట్టపరమైన చర్యలకు డిమాండ్
ఈ వ్యవహారంలో గతంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ కార్యదర్శి, ఎంపీవో, ప్రస్తుతం పోచారం మున్సిపాలిటీ కమిషనర్‌లపై సమగ్ర విచారణ జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఈ భారీ అవినీతి కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిజానిజాలను వెలికితీసి, ప్రజల సొమ్మును కాపాడాల్సిన అవసరం ఉందని లేకపోతే ఇలాంటి అవినీతి అక్రమాలు వ్యవస్థలో పాతుకుపోయి, సామాన్యుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, ప్రజల డిమాండ్లను ఎలా నెరవేరుస్తుందో వేచి చూడాలి.

Latest News

త‌మిళ‌నాడులో నూత‌న‌ విద్యావిధానం

రూపుదిద్దుకుంటున్న ద్విభాషా విధానం పాల‌సీ విడుద‌ల చేసిన ఎం.కే. స్టాలిన్ హిందీ భాషా విధానం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS