ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అదనపు కమీషనర్ లకు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలను అందించి పరిష్కరించాల్సిందిగా కోరారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అదనపు కమీషనర్ లు క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అర్జీల స్వీకరణ అనంతరం అదనపు కమీషనర్ రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కు అన్ని విభాగాల అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, అధికారులను ఆదేశించారు.
అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే దరఖాస్తుదారుడు అదే పనిగా ప్రజావాణి పలు మార్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి గుణాత్మక, సత్వర పరిష్కారం చూపాలనీ హెచ్ఓడి లను ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు మొత్తం 60 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 27, ట్యాక్స్ 5, ఇంజనీరింగ్ విభాగానికి 11, యు.బి.డి విభాగం 3, వెటర్నరి 1 , ఎస్టేట్ 2, ఫైనాన్స్ విభాగం 4, అర్బన్ బయో డైవర్సిటి 3, అర్బన్ కమ్యూనీటి అభివృద్ధి విభాగం కు 1, లీగల్ 1, రవాణా విభాగం 1,భూ సేకరణ ఒక ఫిర్యాదు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 3 ఫిర్యాదు అందాయి. జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 88 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 39, సికింద్రాబాద్ జోన్ 27 , శేరిలింగంపల్లి జోన్ లో 6, ఎల్బీనగర్ జోన్ 8, చార్మినార్ జోన్ లలో 7 , ఖైరతాబాద్ జోన్ లో ఒక ఫిర్యాదు అందింది.
కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, పద్మజ, గీతా రాధిక, సి ఈ సహదేవ్ రత్నాకర్, అడిషనల్ సి సి పి గంగాధర్, వెంకన్న, చీఫ్ వెటర్నరీ అధికారి డా.అబ్దుల్ వకీల్, చీఫ్ మెడికల్ అధికారి డా.పద్మజ, డిప్యూటీ సి ఈ ఓ పనస రెడ్డి, సంపద, హౌసింగ్ ఈ ఈ రాజేశ్వర రావు, ఈఈ ఓ పి వి రావు, ఎస్ ఈ ఎస్ ఎన్ డి పి డిప్యూటీ సి ఈ ఓ పి వి రావు, ఓ ఎస్ డి అనురాధ, హౌసింగ్ సి ఈ నిత్యానంద, అడ్వర్టైజ్మెంట్ ఆఫీసర్ దుర్దన భాను, తదితరులు పాల్గొన్నారు.