Tuesday, June 10, 2025
spot_img

కొండలను మింగుతున్న అనకొండలు

Must Read

దేవుడి పేరుతో మట్టి, మైనింగ్ వ్యాపారం..!

నల్లగొండ అన్వేశ్వరీ మాత గుట్ట భూముల దోపిడి పై ‘ఆదాబ్’ ప్రత్యేక కథనం

గుట్టపైన మైనింగ్, మట్టి వ్యాపారం.. గుట్ట కింద ప్రభుత్వ భూముల కబ్జా కోణం!

రెవిన్యూ, మున్సిపాలిటీ, మైనింగ్ శాఖల మౌనం.. అనుమానస్పదం!

సర్కార్ భూమి సర్వే నెం.33/స లో ఎకరాల కొద్ది భూములను చదును చేస్తున్న వైనం

గతంలో బి.ఆర్.ఎస్, నేడు కాంగ్రెస్ చోటా నేతలకు ఈ గుట్ట ఒక ఆర్థిక వనరు..

ప్రజల భక్తికి చిహ్నంగా నిలవాల్సిన దేవాలయాలు ఇప్పుడు మట్టి, మైనింగ్ వ్యాపారులకు ఒక వరంగా మారిపోతున్నాయి. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్వేశ్వరీమాత గుట్ట చుట్టూ రాజకీయ నాయకులు సృష్టించిన మైనింగ్, మట్టి మాఫియా ప్రస్తుతం కొత్త రకం వ్యూహంతో దోపిడీ కొనసాగిస్తోంది. గుట్ట చుట్టూ దేవుడి గుళ్ళ నిర్మాణం ముసుగులో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు రాత్రి వేళల్లో ఎక్స్ కవేటర్లతో లారీల కదలికలు జోరందుకున్నాయి. దేవుని ఆలయాలు నిర్మిస్తున్నామన్న నెపంతో సహజ వనరుల దోపిడీకి తెగబడ్డారు.

వాస్తవానికి ఈ గుట్ట పరిధి ప్రభుత్వ రికార్డుల ప్రకారం 136 ఎకరాలకు పైగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 33/స లో ఎకరాల కొద్ది భూములను చదును చేసుకోవడమే కాకుండా, ఎత్తైన ప్రాంతాన్ని తవ్వి, సదరు మట్టిని రోజు 50 నుండి 100 ట్రాక్టర్ల వరకు బహిరంగ మార్కెట్లో యదేచ్చగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వి మాఫియా అమ్ముకుంటుండగా, రాత్రిళ్ళు మరోవైపు గుట్ట చుట్టూ బాంబులతో బండరాలను పేల్చి తెల్లవారినంకా సంబంధిత రాళ్లను సైజు రాళ్లుగా మార్చుకొని లక్షలు గడిస్తున్నారు.

చోటా మోట నేతలకు ఈ గుట్ట ఒక ఆర్థిక వనరు.!

గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ చోటా రాజకీయ నాయకులకు, నేడు అధికార కాంగ్రెస్ మోట నేతలకు ఈ గుట్ట అద్భుతమైన ఒక ఆర్థిక వనరుగా మారిందని స్థానిక నల్లగొండ, చర్లపల్లి, అమ్మగూడెం గ్రామ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. సర్వే నెంబర్లు, ఫారెస్ట్ బౌండరీలను మారుస్తున్న ఈ ముఠాలకు అధికారుల మద్దతు లేకపోలేదని స్థానికుల అనుమానం. పక్కన ఉన్న ఫోటోలు పరిశీలిస్తేనే తెలుస్తోంది ఈ గుట్టను ఎంత మేరకు తోవ్వేశారో.

కులానికి ఒక లీడర్, ఆ లీడర్ కు ఒక గుడి!
దేవాలయాల వెనుక దాగిన వ్యాపార వేదిక

అన్వేశ్వరిమాత గుట్ట చుట్టూ ఇటీవల కొన్ని కొత్త గుళ్ళు వెలిశాయి. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో కులానికి ఒక లీడర్, ఆ లీడర్ కు ఒక గుడి చొప్పున దేవుడి ముసుగులో పెద్ద ఎత్తున బుల్డోజర్లను వాడుతూ మట్టిని, మైనింగ్ రాళ్ళను అమ్ముకుంటున్నారు. మైనింగ్ బండరాలను సైజు రాళ్లుగా కట్ చేయడం కొరకు ఏకంగా విద్యుత్ శాఖ స్తంభాల నుండి పట్టపగలు అక్రమంగా కరెంటును దొంగతనంగా వాడుకుంటూ తీవ్రమైన నేరాలకు తెగబడుతున్నారు. మాఫియా ఈ విధంగా బరితెగించిన కూడా నల్లగొండ జిల్లా అధికారులకు కనిపించకపోవడం శోచనీయం.

మున్సిపాలిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల మౌనం.. అనుమానాస్పదం!

ఒకప్పుడు ఈ ప్రాంతం గ్రామీణ ప్రదేశంగా ఉండేది. ప్రస్తుతం ఈ వందలాది కోట్ల ప్రజా సంపద మొత్తం ఇప్పుడు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చబడింది. ఈ ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతంగా కనిపిస్తుంటుంది. అన్వేశ్వరిమాత గుట్ట చుట్టూరా వందలాది సంఖ్యలో నెమలులు, ఇతర పశుపక్షాదులు సంచరిస్తుంటాయి. ఇక్కడ ప్రభుత్వం పేరిట ఉన్న వందలాది ఎకరాలు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సంబంధిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా భారీ తవ్వకాలు జరగడం అంటే, సదరు శాఖల నిర్వీర్యతపై తీవ్రమైన ఆరోపణలు, అనుమానలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్, రెవిన్యూ శాఖల మౌనం మాఫియాకు ఊతమిస్తోంది.

భూమి సర్వే నెంబర్ 33/స పరిధిలోని భూములన్ని ప్రభుత్వానికి చెందినవేనని ‘భూ భారతి’ రికార్డుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ తవ్వకాల అనుమతులు ఎవరిచ్చారు? మైనింగ్ అనుమతులు లేకుండా భూములను చదును చేయడం, మట్టిని తరలించడం ‘తెలంగాణ మైనింగ్ అండ్ మినరల్ మేనేజ్మెంట్ కనసేషన్ రూల్స్-1996 ప్రకారం నేరం, శిక్షార్హమైనది.

కలెక్టర్ గారు.. విచారణ జరపండి!
సహజ వనరులను కాపాడండి!!

అన్వేశ్వరిమాత గుట్ట దోపిడి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి పేరుతో ప్రజలను నమ్మకంలోకి నెట్టి, సహజ వనరులను, ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న మట్టి, మైనింగ్ మాఫియా పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి,అక్కడున్న బుల్డోజర్లను, ట్రాక్టర్లను తక్షణమే జప్తు చేయాలని, జరుగుతున్న దోపిడినీ అరికట్టాలని ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

anakonda
Latest News

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS