Tuesday, June 24, 2025
spot_img

నల్లగొండ మున్సిపాలిటీలో అధికారుల ‘మురికి’ పనులు

Must Read
  • పనులు మొదలైపోయాక టెండర్లు.. నకిలీ కాంట్రాక్టులు!
  • ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు తాకట్టు పెడుతున్న మున్సిపాలిటీ అధికారులు
  • జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదికలు.. పత్రికా ప్రతినిధులకు ‘రాంగ్ రిజైండర్లు’…!
  • తప్పుడు నివేదికలతో అధికారుల మాయాచికిత్స.. నిజాలు వెల్లడిస్తే బెదిరింపులు!

నల్లగొండ మున్సిపాలిటీలో మురుగు నాళాల క్లినింగ్ పనుల పట్ల అధికారులు అవలంబిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే యంత్రాలతో పనులు సాగుతున్నప్పటికీ, ఇప్పుడే కొత్తగా టెండర్లు పిలవడమంటే ఇదేదో కొత్త రకం స్కెచ్ పథకంగా ప్రజలు భావిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, అప్రూవల్ తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. మేజర్ డ్రైన్స్ (పెద్ద మురుగు నాళాలు) శుభ్రపరిచే పనులు (సిల్ట్ క్లినింగ్) కొంతమేర పూర్తి అయిన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం పత్రాల్లో నకిలీ టెండర్లు తీయడం కోసమేనా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు..!
అక్రమాలకు అడ్డు తగలకుండా ఉండటానికి, మున్సిపాలిటీ అధికారులు జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన లేదా ప్రగతిలో ఉన్న పనులకు టెండర్ల అవసరం లేదని స్థానిక పాలనా నిపుణులు అంటున్నారు. అయినా ఈ పనులకు టెండర్లు పిలవడమంటే అది పక్కా దోపిడీ కోసమేనని అందరి అనుమానం. ప్రత్యేకంగా కొంతమంది కాంట్రాక్టర్లతో చేతులు కలిపి, నోటిఫికేషన్‌ లేకుండానే పనులు ప్రారంభించి, ఆ తరువాత టెండర్లను ఆమోదించించుకునే ఓ ప్రత్యేకమైన దోపిడీ వ్యవస్థ ఇక్కడ ఏర్పడినట్లు సమాచారం. దీని వెనుక లక్షలాది రూపాయల అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

పత్రికా ప్రతినిధులకు ‘రాంగ్ రిజైండర్లు’…!
అధికారులు చేస్తున్న అక్రమాలను, టెండర్ గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తున్న పద్ధతులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రతినిధులపై, నకిలీ ఫిర్యాదులు సర్వసాధారణం. ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై స్పష్టమైన ఆధారాలతో కథనాలు రాసే పత్రికా ప్రతినిధులపై తాజాగా కొత్త రూపంలో దాడులు మొదలయ్యాయి. నిజాలను వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులకు అధికారుల నుంచి ‘రాంగ్ రిజైండర్లు’ (తప్పుడు నివేదికలు) రూపంలో ప్రతీకారం ప్రారంభమైంది. నల్గొండ మున్సిపాలిటీ అధికారులు కూడా ఇప్పుడు ‘ఆదాబ్’ విషయంలో ఇదే ట్రెండ్ ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.

అద్దంకి రోడ్డు ఆర్ అండ్ బి కల్వర్టు నుండి ఎస్టీపికీ వెళ్లే మేజర్ నాళాలో యంత్రాలతో జరుగుతున్న ‘సిల్ట్ క్లీనింగ్’ పనులు (ఈ టెండర్ పనుల ఖరీదు 10 లక్షలు)

పనులు మొదలైపోయాక టెండర్లు..?
తాజాగా నల్లగొండ మున్సిపాలిటీలో మురుగు కాలువల శుభ్రత పేరుతో(సిల్ట్ క్లినింగ్), యంత్రాల ద్వారా ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిసింది. కానీ ఇప్పుడే వాటికి టెండర్లు పిలవటం, నల్గొండ మున్సిపాలిటీ అధికారుల మాయాజాలానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతుల్లో పనులు అప్పగించడం వల్ల నాణ్యతపైనా, సమయానుసారంగా పనులు పూర్తి కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కష్టార్జిత పన్నులపై నడిచే ప్రాజెక్టులు కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసం దారితప్పుతున్నాయి.

ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు తాకట్టు.!
ఇలాంటి నకిలీ కాంట్రాక్ట్ విధానాల వలన ప్రజల సొమ్ము బహిరంగ దోపిడికి గురవుతోంది. కాగితాలపై నిర్మాణాలు, అవినీతి అధికారుల విధ్వంసకర పాలన కారణంగా ప్రజా ధనం కాంట్రాక్టర్ల ఖజానాకు తరలించబడుతోంది. ఈ రకమైన అవినీతి పేరుతో నల్లగొండ మున్సిపాలిటీకి ‘మురికి’ ముద్రపడుతోంది.

ఈ అవినీతి ‘మురుకి’ని తొలగించేందుకు ప్రజా ప్రతినిధులు, అనుభవం కలిగిన మాజీ కౌన్సిలర్లు, జిల్లాకు చెందిన శాసన సభ్యులు, మంత్రి ఈ అంశంపై మౌనం వీడాలి. టెండర్ల గోల్ మాల్ కు, అధికారిక దోపిడీకి పాల్పడుతున్న సంబంధిత అధికారులపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజా ధన దుర్వినియోగాన్ని అడ్డుకునే బాధ్యత ప్రతీ ఒక్క పౌరుడి మీద కూడా ఉంది. ఈ దోపిడీ వ్యవహారంపై ప్రభుత్వం, లోకాయుక్త, లేదా విపక్ష పార్టీల నుండి పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని తాకట్టు పెట్టడం అత్యంత హేయమైన చర్యగా భావించాలి. నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ దోపిడీ అరికట్టడానికి ‘ఆదాబ్’ స్థానిక ప్రజల నుండి కీలకమైన సమాచారాన్ని కోరుకుంటోంది.

Latest News

ప్రధాని మోదీని కలుద్దాం రండి

అన్ని పార్టీల్లోని బీసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS