భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఇవాళ(జూన్ 25 బుధవారం) ప్రారంభమైంది. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌తో కూడిన బృందం ఫ్లోరిడా(అమెరికా)లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌లో రోదసీలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. యక్సియం-4 వ్యోమగాములు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి నింగిలోకి బయలుదేశారు.

ఫాల్కన్-9 వాహక నౌక విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. అనంతరం కొద్ది సెకన్లకే రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస) దిశగా ప్రయాణం కొనసాగించింది. జూన్ 26 గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఐఎస్ఎస్‌కి చేరుకుంటుంది. అమెరికాలోని వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ.. నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ.. ఈఎస్ఏ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. 41 ఏళ్ల విరామం అనంతరం (1984లో రాకేశ్ శర్మ తర్వాత) భారతీయుడు (శుభాంశు శుక్లా) రోదసీలోకి అడుగుపెట్టాడు. ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్‌లో 14 రోజులు ఉండి 31 దేశాలకు సంబంధించిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీతో అంతరిక్షం నుంచే మాట్లాడనున్నారు.
