- భాస్కర్ రెడ్డి ప్రమోషన్‌పై నిప్పులు చెరిగిన నిపుణులు
- నచ్చినోళ్ళకి బెల్లం.. నచ్చనోళ్ళకి సున్నం
- రిజర్వేషన్ల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు
- సీనియారిటీకి పాతర, న్యాయం ఎవరికి?
- రిజర్వేషన్లకు తిలోదకాలు, రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘిస్తారా?
- తప్పుడు సీనియారిటీ వాదనలు, కప్పిపుచ్చుకోవడానికి పన్నాగాలు!
తెలంగాణ ఉద్యమ లక్ష్యం స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. మన ప్రాంత యువతకు నిజాయతీగా దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, ఆత్మస్థైర్యం, ఆత్మ గౌరవంతో బతికే రోజు సాకారం కావాలన్నదే ముఖ్య ఉద్దేశం.. కానీ నేడు ఓ ప్రాంతేతరుడుని తీసుకొచ్చి తెలంగాణలో ముఖ్యమైన హోదాలో కూర్చొబెట్టి తెలంగాణలో అర్హులైన ఉద్యోగస్థులను మోసం చేస్తున్నారు.. కాళోజీ గారు చెప్పినట్లు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరదాటించ తరిమికొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే పొలిమేరలోనే బొందపెట్టు… అన్న విధంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిపై దృష్టి సారించి అక్రమార్కులను తరిమికొట్టాలని తెలంగాణలోని అర్హులైన ఉద్యోగస్థులు డిమాండ్ చేస్తున్నారు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ఎసి)గా ఎస్. భాస్కర్ రెడ్డికి ఇచ్చిన ప్రమోషన్ ప్రభుత్వ నిబంధనలను, సీనియారిటీని, రోస్టర్ పాయింట్లను, ముఖ్యంగా రిజర్వేషన్ల చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నియామకంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి, రిజర్వేషన్ వర్గాల హక్కులను కాలరాసి, అర్హత లేని వారికి పదోన్నతి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీనియారిటీకి పాతర.. న్యాయం ఎవరికి?
సాధారణంగా, ప్రభుత్వ ప్రమోషన్లు సీనియారిటీ ఆధారంగా జరుగుతాయి. కానీ, ఈ విషయంలో ఎస్. భాస్కర్ రెడ్డి కంటే సీనియర్లు అయిన ఆరుగురిని.. ఎం. కోటేశ్వర రావు, బి. నర్సింగ్ రావు, ఎ. సహదేవ్ రత్నాకర్, ఎస్. ప్రవీణ్ చంద్ర, దత్తూపంత్, బి. విశ్వనాథ రాజులను విస్మరించి, భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనను స్పష్టం చేస్తోంది. 24.09.2019 నాటి ఎస్‌ఈల తుది సీనియారిటీ జాబితా ప్రకారం, భాస్కర్ రెడ్డి 38వ నంబర్‌లో ఉన్నారు. ఆయన కంటే ముందున్న 14, 16, 26, 27, 29, 33 నంబర్‌లలో ఉన్న సీనియర్లను కాదని ఈ ప్రమోషన్ ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా, బి. సుమలతను కూడా విస్మరించడం సీనియారిటీ ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
రిజర్వేషన్లకు తిలోదకాలు..
ఈ ప్రమోషన్‌లో అత్యంత దారుణంగా ఉల్లంఘించబడిన అంశం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రోస్టర్ పాయింట్. బి. నర్సింగ్ రావు (ఎస్టీ) మరియు ఎ. సహదేవ్ రత్నాకర్ (ఎస్సీ) ఎస్. భాస్కర్ రెడ్డి కంటే సీనియర్లుగా ఉన్నందున, వారిని విస్మరించి జనరల్ కేటగిరీ అభ్యర్థికి ప్రమోషన్ ఇవ్వడం రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించడమే. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ సందర్భంలో అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులను కాదని, ఒక జనరల్ కేటగిరీ అభ్యర్థికి పదోన్నతి కట్టబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తిని, రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశ్యాన్ని కాలరాసినట్టేనని విమర్శకులు మండిపడుతున్నారు.
తప్పుడు సీనియారిటీ వాదనలు: కప్పిపుచ్చుకోవడానికి పన్నాగాలు!
ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ ఎ సీ) పదవిని పొందేందుకు ఎస్. భాస్కర్ రెడ్డి డీఈఈ క్యాడర్‌లో (2010లో) తప్పుగా నిర్ణయించబడిన తన సీనియారిటీని ఆధారం చేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఉన్నత క్యాడర్‌లో (ఎస్‌ఈ) చెల్లుబాటు అయ్యే సీనియారిటీ జాబితా అందుబాటులో ఉన్నప్పుడు ప్రాథమిక పోస్ట్‌లో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు, డీఈఈ సీనియారిటీని పరిగణించినప్పటికీ, వి. మోహన్ కుమార్ ఎస్. భాస్కర్ రెడ్డి కంటే చాలా సీనియర్. ఎం. దేవనంద్ పదవీ విరమణ చేసిన తర్వాత, వి. మోహన్ కుమార్‌ను ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ ఏ సి)గా నియమించారు. కానీ భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రాతినిధ్యం ఆధారంగా మోహన్ కుమార్‌ను తొలగించి, భాస్కర్ రెడ్డిని నియమించడం ఈ మొత్తం ప్రక్రియ చట్టబద్ధతనే ప్రశ్నార్థకం చేస్తోంది.
అవినీతి ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘన
వి. మోహన్ కుమార్‌పై పెండింగ్‌లో ఉన్న ఆరోపణల కారణంగా ఎస్‌ఈగా పదోన్నతి పొందలేదని, అందువల్ల ఆయన స్థానంలో భాస్కర్ రెడ్డిని నియమించారని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. అయితే, జీఓఆర్టీ 912 స్పష్టం చేసినట్లుగా, ఎస్. భాస్కర్ రెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు (అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మరియు పులివెందుల మున్సిపాలిటీలో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లాన్ (సీసీ రోడ్ల నిర్మాణం మొదలైనవి) కింద జరిగిన పనులకు సంబంధించినవి) పెండింగ్‌లో ఉన్నాయి. ఒకరిపై ఆరోపణలు ఉన్నాయనే కారణంతో ప్రమోషన్ నిరాకరించి, అదే కారణాలు వర్తించే మరొకరికి ప్రమోషన్ ఇవ్వడం సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడమే. ఇది అధికారుల పక్షపాతానికి, నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడానికి నిదర్శనం. సాధారణంగా, ఉద్యోగిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు లేదా క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రమోషన్లను నిలిపివేస్తారు. ఈ సందర్భంలో, ఇద్దరు వ్యక్తుల విషయంలో వేర్వేరు నిబంధనలను పాటించడం అన్యాయం.
ఈ వాస్తవాలను బట్టి చూస్తే, ఎస్. భాస్కర్ రెడ్డికి ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ ఎ సి)గా ఇచ్చిన ప్రమోషన్ సీనియారిటీ నిబంధనలు, రిజర్వేషన్ల నియమాలు (రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రోస్టర్ పాయింట్), మరియు సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నియామకం చట్టబద్ధంగా నిలబడటానికి అవకాశం లేదు మరియు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.