కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్‌లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి చెందిన సీనియర్ అసిస్టెంట్ సునీత, ఆస్తి పన్ను విభాగంలో విధులు నిర్వహిస్తోంది. బాధితుడు తన ఆస్తికి సంబంధించిన మ్యుటేషన్ పనిలో సహకరించాలని ఆమెను సంప్రదించగా, కావలసిన పత్రాలు కోసం ఆమె రూ.80,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుడు ఆమెను పదేపదే అభ్యర్థించినా, కనీసం రూ.30,000 ఇవ్వాల్సిందేనని ఆమె మొండిగా వ్యవహారించారని దీనితో తప్పనిసరై ఎసీబీ అధికారులను సంప్రదించిన్నట్లు బాధితుడు వివరించారు. ఈ నేపథ్యంలో, ఆ అధికారి ఆర్ధిక వేధింపులకు తట్టుకోలేని బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక మేరకు ఏసీబీ అధికారులు సునీతకు లంచం అందజేస్తుండగా పట్టుకునేందుకు ఉంచిన దాడిలో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.30,000 నగదు బాధితుడి ఫైలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ – “పూర్తి ఆధారాలతో సునీతను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే తగిన శిక్ష తప్పదని” హెచ్చరించారు. ఈ సంఘటన కూకట్‌పల్లి జోన్‌లో ఉన్న అధికారులు, ప్రజల మధ్య తీవ్ర చర్చలకు దారి తీసింది. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత కోసం ఇలాంటి చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.