- నకిలీ విత్తనాలు విక్రయించారని రైతులు ఆరోపణ
- అధికారులకు ఫిర్యాదు చేస్తే, షాపు యజమానులకు వత్తాసు
- అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు
రైతులు కొనుగోల చేసిన వరి విత్తనాలు నేటి వరకు మొలకలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్య ఆగ్రో ట్రేడర్ షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వేసి తాము మోసపోయామంటూ లబోదిబోమన్నారు. సూర్య ఆగ్రో ట్రేడర్ షాపులో గంగా కావేరి సన్న రకం వరి సీడ్స్ కొనుగోలు చేసి వేయగా మొలకెత్తలేదన్నారు. గత నెల 23న మండె కడితే రెండు మూడు రోజుల్లో మొలకెత్తాల్సి ఉండగా వారం రోజులైనా మొలకలు రావడం లేదని అన్నారు. ఇదేమని దుకాణదారున్ని అడిగితే మాకు సంబందం లేదని, మీరు తీసుకెళ్లిన బ్యాగు ఎలా ఉన్నది అలా తెస్తే వేరేవి ఇస్తామంటున్నాడన్నారు. బ్యాగు విప్పి విత్తనాలు వేస్తేనే మాకు విషయం తెలిసిందని ఇప్పుడు బ్యాగ్ తెమ్మంటే ఎలా తేవాలని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి విత్తనాల శాంపిల్స్ సేకరించి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ సూర్య ఆగ్రో ట్రేడర్స్ లో కొనుగోలు చేసిన రైతు మొలకలు రాలేదని మూడు రోజుల క్రితం మండల వ్యవసాయ శాఖ ఆధికారికి ఫిర్యాదు చేయడంతో సీడ్స్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం పంపించడం జరిగిందని, మొలక శాతం తక్కువ ఉన్నందున రైతుకు నష్టం జరగకుండా అదే షాపులో మూడు బస్టాల సీడ్ మార్చి ఇచ్చారని తెలిపారు.మండల అగ్రికల్చర్ అధికారి శాంపిల్స్ కు, రైతులు తీసుకువచ్చిన బ్యాగులోని సీడ్స్ ల్యాబ్ కు పంపకుండా, షాపులో ఉన్న వేరే బస్తాల సీడ్స్ ను శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపినట్లు తెలుస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా షాపు అధికారులకు వత్తాసు పలుకుతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే అధికారులు వ్యాపారస్తులకు కొమ్ముు కాయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. రైతులు విత్తన కొనుగోలు లైసెన్స్ ఉన్న దుకాణాలలో మాత్రమే చేయాలని, కొనుగోలు సమయంలో రసీదును తప్పకుండా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించుటకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.