కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫెర్టిలైజర్స్ డీలర్లపై,దుకాణదారుల పై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని రైతు వేధికలో ఫెర్టిలైజర్స్, విత్తన డీలర్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విక్రయదారులు రికార్డులు స్పష్టంగా రాయాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు పూర్తి వివరాలతో కూడిన రసీదులు ఇవ్వాలన్నారు.డీలర్లు వద్ద గల బిల్లు బుక్ లో రైతుల సంతకం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్, గ్రౌండ్ బాలన్స్, బ్యాచ్ నంబర్ వివరాలు క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు.విత్తన చట్టం 1966 విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983 ప్రకారం తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి నారెడ్డి సీతారాం రెడ్డి, డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు.