03 జూలై “అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినం” సందర్భంగా
నేడు ప్రపంచమంత ప్లాస్టిక్‌మయం అయ్యింది. ప్లాస్టిక్ కనబడని గృహం లేదు, వాడని మనిషి లేడు. ఎక్కడ చూసినా ఏమున్నదా గర్వకారణం, సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగుల బూతమే. వాడడానికి సౌకర్యంగా, మన్నిక కలిగిన గుణాలు ప్లాస్టిక్స్ స్వంతం. చెవులను శుభ్రం చేసుకునే ఇయర్ బడ్ నుంచి, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పాలు/నూనె/ద్రవాల ప్యాకెట్లు, వాటర్ పాటిల్స్, పానీయాలు తాగే స్ట్రాలు, వంటింటి సరుకులు నిల్వ చేసే డబ్బాలు, కుర్చీలు, పలు రకాల పర్నీచర్లు, పిల్లల ఆట బొమ్మల వరకు ఎక్కడ చూసినా, ఏ దుకాణానికి వెళ్లినా సర్వం ప్లాస్టిక్ వస్తువులు లేదా ప్యాకేజ్‌లు కనిపిస్తున్నాయి. నాడు కర్రకు ప్రత్యామ్నాయంగా, వరప్రసాదంగా 1930ల్లో కనుగొనబడి, 1970-1980లో వాడకం మొదలైన ప్లాస్టిక్ ఉత్పత్తులు నేడు సముద్ర జలాలు, సాగు నేలలను సహితం విషతుల్యం చేసే దుస్థితి వరకు ప్లాస్టిక్ బూతం చేరింది. వాడి పడేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు జీవ విచ్చిన్నం కావడానికి 100 నుంచి 1000 ఏండ్లు పడుతున్నది. రసాయనశాస్త్ర పరంగా చిన్న చిన్న అణువు అనేకం రసాయన చర్యల ద్వారా కలిసి అతి పెద్ద శృంఖలాలు ఏర్పడి, ప్లాస్టిక్ బృహదణువులుగా లేదా పాలిమర్స్‌గా పిలువబడతాయి. పాలిథీన్ కవర్స్, పివిసి పైప్స్ లాంటి ప్రధాన ప్లాస్టిక్ ఉత్పత్తుల గూర్చి మనకు తెలుసు.
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినం :
ఒక నాడు షాపుల్లో పర్యావరణహిత పేపర్ ప్సాకింగ్ చేసే అలవాటు ఉండేది. మనం ఏ వస్తువును కొన్నా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లోనే ఇంటికి తెచ్చుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా సాలీనా 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేయబడడం, నిమిషానికి 1 మిలియన్ బ్యాగులు వాడడం, ప్రతి మనిషి సగటున 25 నిమిషాలకు ఒక ప్లాస్టిక్ బ్యాగు వాడడం జరుగుతున్నది. విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా వాడుతున్న ప్లాస్టిక్ బ్యాగుల పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమని మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంతో దాదాపు ఒక లక్ష సముద్ర జంతువుల మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ పౌర సమాజం ప్రమాదకర ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పట్ల అవగాహన కల్పించడానికి, వాటి దుష్ప్రభావాలను వివరించడానికి ప్రతి ఏట 03 జూలై రోజున “అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినం” పాటించుట ఆనవాయితీగా వస్తున్నది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినం వేదికగా ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, వాటి విష ప్రభావాలను వివరించడం, వాటికి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వెతకడం, పర్యావరణ పరిరక్షణకు కంకనబద్దులు కావడం లాంటి అంశాలను అవగాహన పరుస్తారు.
ప్లాస్టిక్ బ్యాగులు లేని పౌర సమాజ నిర్మాణం సాధ్యమా !
మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవడం, ప్లాస్టిక్ కవర్స్‌కు బదులుగా పేపర్ లేదా క్లాత్ బ్యాగులు వాడడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించడం, తప్పనిసరి అయినపుడు ఒక్క ప్లాస్టిక్ బ్యాగును తిరిగి పలు మార్లు వాడడం, ప్లాస్టిక్ బ్యాగులు లేని మార్కెటింగ్ రోజులను తిరిగి పొందడం, సహజ ఉత్పత్తులతో బ్యాగులను తయారు చేసుకొని వాడడం లాంటి చర్యలకు పూనుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు మానవ శరీరంలోకి చేరి తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం, సకల జీవ కోటి మనుగడ ప్రశ్నార్థకం కావడం జరుగుతుంది. నేడు ప్లాస్టిక్ వ్యర్థాలు భూగ్రహానికి శాపాలుగా మారుతున్నాయి. సారవంతమైన నేలల్ని, సముద్ర నదీ జలాలను ప్లాస్టిక్ బ్యాగులు కలుషితం చేస్తున్నాయి.
అన్నీ తెలిసిన నరుడు నరకానికి నిచ్చెనలు వేస్తున్నాడు. తను ప్రమాదంలో పడడమే కాకుండా సకల జీవరాశులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాడు నేటి డిజిటల్ యుగపు మానవుడు. అందుకే తక్షణమే ప్లాస్టిక్ బ్యాగు రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనుదాం, మన రేపటి ఆరోగ్యాలను మనమే కాపాడుకుందాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037