శ్రీలంక క్రికెట్ జట్టు బుధవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 77 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మైదానంలోకి సుమారు 6 అడుగుల పొడవున్న పాము దూసుకురావడంతో కలకలం రేగింది. ఈ సమయంలో ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్నారు. ఈ క్రమంలో పామును చూసి అందరూ ఆగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పేలవమైన ఆరంభం తర్వాత కుశాల్ మెండిస్ (45) మంచి ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ చరిత్ అసలంక అద్భుతమైన సెంచరీ సాధించాడు. అసలంక 106 పరుగుల ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 244 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ సందర్భంగా ఈ పాము మైదానంలోకి ప్రవేశించింది.
దీనిని కెమెరాలో బంధించారు. మైదానంలో పాకుతూ వస్తున్న ఈ పాము పిచ్ వైపు వేగంగా కదిలింది. దీంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా శ్రీలంకలో ఈ తరహా పాము మైదానంలోకి ప్రవేశించింది. కొన్ని రోజుల క్రితం ఒక మ్యాచ్ సందర్భంగా పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు. 245 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. తంజీద్ హసన్(62), నజ్ముల్ హుస్సేన్ శాంటో(23) నిలకడైన ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. కానీ నజ్ముల్ రనౌట్ అయిన తర్వాత మొత్తం జట్టు కుప్పకూలింది. 100 పరుగులకు కేవలం ఒక వికెట్ కోల్పోగా.. అది 125/9గా మారింది. చివరికి అలీ కొంతసేపు పోరాడి అర్థ సెంచరీ(51) సాధించినా అది సరిపోలేదు. శ్రీలంక క్రికెట్ జట్టు మొదటి వన్డేను 77 పరుగుల తేడాతో గెలుచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డే శనివారం, జూలై 5న జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ జూలై 8న ఉంటుంది.