వరదనీటిలో మునిగిన సహకార బ్యాంక్
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు చాలా ప్రసిద్ధి. సమీపంలోని పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది ఖాతాదారులు తమ డబ్బును ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. నగదుతోపాటు నగలు, విలువైన పత్రాలను బ్యాంకు లాకర్లలో దాచుకున్నారు.
కాగా, జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని 23న ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదలకు మండి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తునాగ్ మార్కెట్ ప్రాంతంలోని రెండతస్తుల బిల్డింగ్‌లో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతికి ఒక షట్టర్ పైకి లేచింది. మరో రెండు షట్టర్‌లు వంకరపోయాయి. మరోవైపు వరద నీటి వల్ల ఆ బ్యాంకులోని లక్షలాది నగదుతోపాటు లాకర్లలో ఉన్న నగలు, డబ్బు, ఇతర పత్రాలు పాడై ఉంటాయని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. కోట్లలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల ఆ బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు.