పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డి గూడ వెళ్లే దారి
20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం వల్ల నాగిరెడ్డి గూడ నుండి బాకారం వచ్చే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మూగజీవాలు సైతం నీళ్లలో మునిగిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డి గూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ నుండి బాకారం వెళ్ళే రోడ్డుకు వరద నీరు చేరింది. ఫలితంగా బాకారం నుండి ఎనికేపల్లి, కాశీం భౌలి, అమ్డాపూర్ తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన ఈ వర్షానికి ఎర్రగుంట చెరువుకు వచ్చే వరదకాలువను బడారియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించటం వల్ల వరద నీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసివేశారు. ఈ కారణంగా వరద బాకారం నుంచి నాగిరెడ్డి గూడ వెళ్ళే రోడ్డు పై చేరి, పంట పొలాలను కూడా ముంచేసింది.

పంట పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల వద్ద ఉన్న మూగజీవాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంటలు మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మూగజీవాలను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, వరదకాలువలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేసి, వరదకాలువను ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
