Thursday, July 24, 2025
spot_img

టీకేఆర్ కళాశాల ఫీజుల దోపిడి

Must Read
  • ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000.
  • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900 మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
  • బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 మాత్రమే (రూ.39,000 – రూ.14,900).
  • టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి రూ.36,100 వసూలు
  • దీనివల్ల విద్యార్థులపై కళాశాల అదనంగా రూ.12,000 పైగా భారం మోపుతోంది.
  • దీనికి తోడు ఆలస్య రుసుము కింద మరో రూ.500 వసూలు చేస్తున్నారు.
  • ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల ఫీజుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ విద్యాసంస్థ తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం వాటిని బేఖాతరు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను, ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ బీసీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థుల నుండి వేల రూపాయలలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు ఏమి చెబుతున్నాయి?
2025-26 విద్యా సంవత్సరానికి గాను, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజును రూ.39,000గా నిర్ధారించింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో శ్రేణి-ఆధారిత (స్థాయిలుగా) విధానాన్ని ప్రవేశపెట్టింది

  • పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ (రూ.39,000): ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి, మరియు పాలిసెట్‌లో 1000 లోపు ర్యాంక్ సాధించిన వారికి ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లిస్తుంది.
  • పాక్షిక ఫీజు రీయింబర్స్‌మెంట్ (రూ.14,900): పైన పేర్కొన్న కేటగిరీలలోకి రాని బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం పాత ఫీజు విధానం ప్రకారం గరిష్టంగా రూ.14,900 మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
    ఈ లెక్కన, పాక్షిక రీయింబర్స్‌మెంట్ పొందే బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 (రూ.39,000 – రూ.14,900) మాత్రమే.

టీకేఆర్ కళాశాల అక్రమ వసూళ్ల పర్వం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటాలో సీటు పొందిన బీసీ, ఓసీ విద్యార్థుల నుండి కేవలం రూ.24,100 మాత్రమే వసూలు చేయాలి. కానీ టీకేఆర్ కళాశాల యాజమాన్యం ఇవేవీ పట్టించుకోకుండా, ప్రతి విద్యార్థి నుండి రూ.36,100 డిమాండ్ చేస్తోంది. దీనికి అదనంగా, ఆలస్య రుసుము కింద మరో రూ.500 వసూలు చేస్తూ, విద్యార్థులపై మొత్తం రూ.36,600 భారం మోపుతోంది.

ప్రభుత్వం చెల్లించే రూ.14,900 మరియు విద్యార్థుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న రూ.36,600 కలిపితే, కళాశాల ఒక్కో విద్యార్థి నుండి మొత్తం రూ.51,500 దండుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు రూ.39,000 కంటే రూ.12,500 ఎక్కువ.

హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ
ఫీజుల విషయంలో యాజమాన్యాల దోపిడీని అరికట్టేందుకు దాఖలైన రిట్ పిటిషన్ (డ‌బ్ల్యూపి 19004 ఆఫ్‌ 2023) పై ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని సూచించింది. కానీ టీకేఆర్ కళాశాల యాజమాన్యం ఈ ఉత్తర్వులను సైతం కాలరాస్తూ, తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తల్లిదండ్రుల ఆవేదన, ప్రభుత్వ వైఖరికి విరుద్ధం
“ఓ పక్క ప్రభుత్వం బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడతామని చెబుతోంది. మరోపక్క టీకేఆర్ వంటి కళాశాలలు ప్రభుత్వ ఆశయాలకు గండికొడుతూ, బీసీ విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. అడిగితే యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోంది. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడిగినంత కట్టలేక అప్పులు చేయాల్సి వస్తోంది,” అని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ప్రభుత్వ నిబంధనలను, న్యాయస్థానం ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్న టీకేఆర్ కళాశాల యాజమాన్యంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని, కళాశాల గుర్తింపును రద్దు చేసే స్థాయి వరకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS