- ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు, గాజుల మహోత్సవం
- మణికొండ అలకాపూర్ టౌన్షిప్‌లో మహిళల సందడి
మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గోరింటాకు మరియు గాజుల మహోత్సవం మణికొండ అలకాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో ఉత్సాహభరితంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సాంస్కృతిక కార్యకర్త డా. బత్తిని కీర్తిలతా గౌడ్ ఘనంగా నిర్వహించారు.

ఈ మహోత్సవానికి సుమారు 200 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయ వేషధారణలతో, ఆనందభరితమైన ముఖాలతో గోరింటాకు వేసుకుంటూ, గాజులు ధరించుకుంటూ మహిళలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు. “చూడమ్మా, చల్లగా చూడమ్మా…” అంటూ పరస్పరంగా స్నేహపూర్వకంగా పలకరించుకుంటూ అమ్మవారికి పూజలు సమర్పించారు. పూజానంతరం మహిళలు ఆటపాటలతో, జానపద గీతాలతో, నృత్యాలతో సాయంత్రం వరకు మేళానందంగా గడిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణికొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ధూళిపాళ్ల సీతారాం తన సతీమణితో కలిసి హాజరై, డా. కీర్తిలతా గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు. “సాంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని కొనియాడారు. నేటి తరం మహిళలకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేసేలా కీర్తిలత చేస్తున్న ప్రయత్నం అభినందనీయమైనది” అని అన్నారు. అదేవిధంగా, భవిష్యత్తులో మరిన్ని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, “ఇలాంటి కార్యక్రమాలు మాకు కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ, సామాజిక బంధాలను బలపరుస్తాయి. మంగళకారకమైన గోరింటాకు, గాజులతో మా జీవితం కూడా కళకళలాడాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
డా. బత్తిని కీర్తిలతా గౌడ్ మాట్లాడుతూ, “మాంగల్యం ఫౌండేషన్ పేదలకు సేవ చేసే సంస్థగా మాత్రమే కాక, మహిళల సాంస్కృతిక అభివృద్ధికి కూడా కృషి చేస్తుందని తెలిపారు. “సాంప్రదాయాలను కొనసాగించడం మన బాధ్యత. ప్రతి మహిళ ముఖంలో ఆనందం కనిపిస్తే, అది మా విజయానికి నిదర్శనం” అని తెలిపారు.