జ్ఞానం సంపాదనకు, చైతన్య వికాసానికి కేంద్రబిందువులైన గ్రంథాలయాలు ప్రస్తుతం నిర్లక్ష్యం, వాడుకలేమి కారణంగా చీకటి మూలల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠక లోకానికి మార్గదర్శకంగా నిలిచిన ఈ గ్రంథాలయాలు ఆధునిక యుగానికి తగినట్లు రూపాంతరం చెందకపోవడం వల్ల వాటి ఉనికి ప్రమాదంలో పడుతోంది.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ గ్రంథాలయాలు తక్కువ సదుపాయాలతో, మురికిగా, పాత పుస్తకాలతో నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎక్కడో మూలన ఉన్న చిన్న గదులు, విద్యుత్, ఇంటర్నెట్ లేని వాతావరణం, మరియు సిబ్బంది కొరత వల్ల యువత గ్రంథాలయాలవైపు మొగ్గు చూపడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రంథాలయాల ఆధునీకరణ అత్యంత అవసరం. డిజిటల్ పుస్తకాల ప్రవేశం, ఈ-లైబ్రరీల ఏర్పాటుతో విద్యార్థులకు తక్కువ సమయంలో విస్తృతమైన సమాచారం అందించవచ్చు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, వెబ్ ఆధారిత గ్రంథాలయ సదుపాయాలు అందుబాటులో ఉంటే గ్రామీణ విద్యార్థులు పట్టణ స్థాయిలో ఉన్న పాఠకుల సమానంగా పోటీ పరీక్షలకి, అనేక రంగాల్లో విజ్ఞానం సంపాదించుకునే అవకాశాన్ని పొందగలరు.
ఇది ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారుతుంది. పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉన్న వారు ఆధునిక గ్రంథాలయాల ద్వారా అనేక రకాల పాఠ్యపుస్తకాలు, సాహిత్యం, విజ్ఞాన కోశాలు చదివే అవకాశం పొందుతారు. ఇదే వారి భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది.
గ్రంథాలయాలను సాంకేతికంగా అభివృద్ధి చేస్తే అవి కేవలం పుస్తక గదులుగా కాక, విద్యారంగానికి సేవలందించే జ్ఞాన కేంద్రాలుగా మారతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వృత్తిపరమైన ఉద్యోగార్థులు అందరూ లాభపడతారు. గ్రామీణ మహిళలకు, వృద్ధులకు కూడా ఈ వనరులు ఉపయోగపడతాయి.
ఈ ఆధునీకరణలో భాగంగా పుస్తకాల డిజిటైజేషన్, బహుళ భాషల్లో ఆడియో పుస్తకాలు, విజువల్ లెర్నింగ్ మెటీరియల్ వంటి సదుపాయాలు అందించవచ్చు. ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు, చదువు మానినవారికి పునశ్చరణ కోర్సులు కూడా గ్రంథాలయాల ద్వారా చేపట్టవచ్చు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒక గ్రామంలో ఆధునిక గ్రంథాలయం ఉండడం అంటే ఒక వెలుగుతో నిండిన కేంద్రం ఉండటమే. ఇది తరం తరాలకు మార్గదర్శనం చేస్తుంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంస్థలు కలిసి గ్రంథాలయాల ఆధునీకరణపై దృష్టి పెట్టాలి. అప్పుడే గ్రామీణ విద్యావ్యవస్థలో నిజమైన మార్పు వస్తుంది.
సి.హెచ్.సాయిప్రతాప్