భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా, రాజ్యసభ కార్యదర్శి జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖతో సంప్రదించి, రాజ్యసభ ఛైర్మన్ అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉంటుందని, ఈ ఎన్నికలు “భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం, 1952” మరియు “ఎన్నికల నియమాలు, 1974” ప్రకారం జరుగుతాయని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. ఇంతకు ముందు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ కార్యదర్శి జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈసారి రాజ్యసభ కార్యదర్శి జనరల్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు తోడ్పాటుగా, రాజ్యసభ కార్యాలయానికి చెందిన సంయుక్త కార్యదర్శి గరీమా జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్ సహాయక రిటర్నింగ్ అధికారులుగా నియమించబడ్డారు. వీరు ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు రిటర్నింగ్ అధికారికి తోడ్పాటు అందించనున్నారు. ఈ నియామకానికి సంబంధించి సంబంధిత గజెట్ నోటిఫికేషన్ కూడా శుక్రవారం విడుదల చేసింది.