- వైద్య లోకంలో సాగుతున్న “మోసాలు, నైతిక లోపాలు”
- బ్రాండెడ్ మ్యాజిక్ వెనుక దాగున్న మోసాలు!
- ఔషధాల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారిన వైనం
- డాక్టర్లు స్వార్థ ప్రయోజనం కొరకు బ్రాండెడ్ మందుల సిఫారసు
- భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్రాండెడ్ మందులను సిఫారసు
- బ్రాండెడ్ కంపెనీ ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది డాక్టర్లు,
- జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్న కొందరు డాక్టర్లు
- చట్ట తెలంగాణ చేస్తున్న డాక్టర్లు, ఫార్మసీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
డాక్టర్లు మందులోని ప్రధాన రసాయన పదార్థం పేరును మాత్రమే రాయాలి, ఏ కంపెనీ తయారు చేసిందో చెప్పే బ్రాండెడ్ పేరును రాయకూడదు. ఉదాహరణకు, ‘Paracetamol’ అని రాయాలి కానీ ‘Dolo’ లేదా ‘Calpol’ అని కాదు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో పెరుగుతున్న ఖర్చులు, ముఖ్యంగా ఔషధాల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో, డాక్టర్లు, ఫార్మసీల మధ్య జరుగుతున్న అక్రమాలు, నైతిక లోపాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్రాండెడ్ మందులను సిఫారసు చేయడం, అధిక ధరలకు వాటిని విక్రయించడం వంటివి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
బ్రాండెడ్ మందుల సిఫారసు: చట్ట విరుద్ధ చర్యలు
భారత వైద్య మండలి 2016లోనే స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం, డాక్టర్లు రోగులకు మందులు రాసేటప్పుడు జనరిక్ పేరుతో మాత్రమే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే, మందులోని ప్రధాన రసాయన పదార్థం పేరును మాత్రమే రాయాలి, ఏ కంపెనీ తయారు చేసిందో చెప్పే బ్రాండెడ్ పేరును రాయకూడదు. ఉదాహరణకు, ‘Paracetamol’ అని రాయాలి కానీ ‘Dolo’ లేదా ‘Calpol’ అని కాదు.
ఈ నిబంధన ప్రధాన ఉద్దేశ్యం రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే. జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. డాక్టర్లు జనరిక్ పేర్లు రాస్తే, రోగులు తమకు నచ్చిన, తక్కువ ధరలో లభించే జనరిక్ మందులను కొనుగోలు చేయవచ్చు. ఇది ఔషధాల అందుబాటును పెంచి, పేదలకు కూడా వైద్య సేవలు అందేలా చేస్తుంది. మార్కెట్‌లో పోటీని పెంచి, ఔషధాల ధరలను నియంత్రించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
అయితే, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. చాలా మంది డాక్టర్లు ఇప్పటికీ బ్రాండెడ్ పేర్లతోనే ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఫార్మా కంపెనీల నుండి లభించే ప్రోత్సాహకాలు. భారీగా డబ్బులు, బహుమతులు, విదేశీ పర్యటనలు వంటి అనేక రూపాల్లో కంపెనీలు డాక్టర్లను ప్రలోభ పెడుతున్నాయి. ఈ ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది డాక్టర్లు, జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు కలిగించి, బ్రాండెడ్ మందుల వైపు వారిని మళ్లిస్తున్నారు. ఇది స్పష్టంగా చట్ట విరుద్ధం, నైతిక విలువల ఉల్లంఘన.
పేటెంట్ గడువు ముగిసిన తర్వాత..
పేటెంట్ గడువు ముగిసిన తర్వాత, ఆ ఔషధ ఫార్ములా పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. అప్పుడు ఏ కంపెనీ అయినా, ఆ ఫార్ములాను ఉపయోగించి, జనరిక్ ఔషధాలను తయారు చేయవచ్చు. జనరిక్ ఔషధాలు సాధారణంగా అసలు పేటెంట్ పొందిన ఔషధాల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి, ఎందుకంటే వాటి తయారీకి పరిశోధన మరియు అభివృద్ధి ఖర్చులు ఉండవు.పేటెంట్ గడువు ముగిసిన తర్వాత ప్రతి మెడిసిన్ జనరిక్ ఔషధాలే.

ఫార్మసీలలో మోసాలు, అధిక ధరల దందా
డాక్టర్లు బ్రాండెడ్ పేరుతో ప్రిస్క్రిప్షన్ రాసినా, ఫార్మసిస్టులకు నైతిక బాధ్యత ఉంది. వారు రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్ ప్రత్యామ్నాయాల గురించి వివరించాలి. కానీ, అనేక ఫార్మసీలలో ఇది జరగడం లేదు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా, అధిక ధరలకు బ్రాండెడ్ మందులను విక్రయిస్తున్నారు. ఇది నేరుగా మోసం కానప్పటికీ, ప్రజల ఆరోగ్యం మరియు ఆర్థిక శ్రేయస్సు పట్ల నైతికంగా సరైంది కాదు. ఇది స్పష్టంగా నైతిక విలువల ఉల్లంఘన.
పేద, మధ్యతరగతి ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఔషధాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. డాక్టర్లు, ఫార్మసిస్టులు తమ నైతిక బాధ్యతను విస్మరించి, బ్రాండెడ్ కంపెనీల లాభాలకు ప్రాధాన్యత ఇస్తుండటం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, వారి ఆరోగ్యం, ఆశలు, జీవితాలతో ఆడుకోవడమే.
ప్రభుత్వ చర్యలు, ప్రజల పాత్ర
ప్రభుత్వం “జన్ ఔషధి పరియోజన” వంటి పథకాల ద్వారా జనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ పథకాల కింద జనరిక్ మందులు తక్కువ ధరకు లభించే స్టోర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పథకాలు మరింత విస్తృతం కావాలి. ప్రజలలో, వైద్యులలో జనరిక్ మందులపై అవగాహన పెంచడం, వాటి నాణ్యతపై విశ్వాసం కలిగించడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ ఫార్మసీ మోసాలపై సామాన్య ప్రజలు విజయం సాధిస్తారు.
ఔషధ రంగంలో పేరుకుపోయిన ఈ అవినీతి, మోసాలు, నైతిక విలువల పతనంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే, వారి లైసెన్సులను రద్దు చేయడానికి కూడా వెనుకాడకూడదు. ఫార్మసీలపై నిఘా పెంచి, జనరిక్ ప్రత్యామ్నాయాల గురించి ప్రజలకు వివరించని వారిపై చర్యలు తీసుకోవాలి.
సామాన్య ప్రజలు కూడా తమ ఆరోగ్యం, డబ్బు తమ చేతుల్లోనే ఉండాలంటే, ఈ మోసాలపై ప్రశ్నించాలి.. పోరాడాలి. జనరిక్ మందుల గురించి తెలుసుకోవాలి, వాటిని అడగాలి. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్య కూడా. ప్రజలకు జనరిక్ మెడిసిన్ సంబంధించి మరింత అవగాహన కల్పించడానికి మరియు డాక్టర్లు, ఫార్మసీల మోసాలపై పూర్తి ఆధారాలతో మరిన్ని వార్త కథనాలు మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్ “మా అక్షరం అవినీతిపై అస్త్రం”