- గర్భంలోని గుట్టు బయట పడింది.
- మెడికల్ షాప్ ముసుగులో లింగ నిర్ధారణ పరీక్షలు
- స్కానింగ్ మిషన్ లభ్యం, అదుపులో ఆ ఇద్దరు
- పోలీసుల తనిఖీలలో బయటపడ్డ స్కానింగ్ బాగోతం
- మెడికల్ షాపు చుట్టూ కుళ్ళిన నిజాలు
- జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులా పాత్ర ఏమిటి.?
రెండేళ్లుగా నిశ్శబ్దంగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు. మెడికల్ షాప్ తెర వెనుక శోధనల కథ. కనిపించని కుతంత్రం, కనిపించినా కనబడనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు. చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ నేరం గర్భాలలోని బాలికల హక్కులను కబళిస్తోంది.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని చర్చి కాంపౌండ్, మన్నా చర్చీ ఎదురుగా ” మహా గణపతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్” పేరుతో గత రెండు సంవత్సరాలుగా నాగేష్, చింతల వేలాద్రి లు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి యదేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నాగేష్ అనే వ్యక్తి సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ లో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. వేలాద్రి చర్చి కాంపౌండ్ లో ఉన్న మెడికల్ షాప్ నిర్వహిస్తూ, ఇద్దరూ కలిసి మెడికల్ షాపు వెనకాల ఉన్న రూమ్ లో (సూట్ కేసులో సరిపోయేంత) స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి, గర్భిణీ మహిళలకు నాగేష్ అనే వ్యక్తినే స్కానింగ్ తీసి కడుపులో ఉన్నది మగ, ఆడ శిశువు అని నిర్ధారిస్తున్నారని తెలిసింది. సీక్రెట్ గా నడిపిస్తున్న స్కానింగ్ సెంటర్ నిర్వహణ ను సూర్యాపేట స్పెషల్ బ్రాంచ్, టౌన్ పోలీసులు పట్టుకున్నారు.

రెండేళ్లుగా నిర్వహణ..
గత రెండు ఏళ్లుగా యదేచ్చగా స్కానింగ్ మిషన్ తో పెళ్లయిన మహిళలతో పాటు, పెళ్లి కానీ అమ్మాయిలు సైతం స్కానింగ్ తీయించుకున్నారని తెలుస్తుంది. ఈ స్కానింగ్ తీయడానికి ఒక్కో వ్యక్తి నుండి రూ.15 వేల నుండి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. స్కానింగ్ తీయించడానికి వచ్చిన ఆర్ఎంపి లు మధ్యవర్తిత్వంతో కస్టమర్ లు స్కానింగ్ తీయించుకుంటున్నారు. మరి ఈ విషయం సంబంధిత శాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియదా.? లేదా నెల వారి వాటాలు మౌనంగా ఉంచయా అని, హాస్పిటల్ నిర్వాహకులు పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్ షాపులో స్కానింగ్ మిషన్..
చర్చి కాంపౌండ్ లో ఉన్న మెడికల్ షాపులో చిన్న స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి, గర్భిణీ మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న విశ్వసినీయ సమాచారం మేరకు పోలీసులు, సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో మెడికల్ షాప్ ను తనిఖీ చేయగా అందులో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ పోలీసులకు దొరికింది. షాప్ నిర్వహణకు సంబంధించి సరైన పాత్రలు కూడా వారి వద్ద లేవని తెలిసింది. సంబంధితపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే సూర్యాపేట పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు నాగేష్, వేలాద్రి లను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు రోజులుగా విచారణ చేపట్టారు. రెండు సంవత్సరాలుగా ఎంతమందికి స్కానింగ్ నిర్వహించారు.? అందులో ఎంత మంది మహిళలు, బాలికలు అబార్షన్ చేయించుకున్నారు.? ఇంకా మరెన్నో విషయాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి చంద్రశేఖర్ ని చరవాణి ద్వారా వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.