- బోర్డు కూడా పెట్టకుండా కొన్నేండ్లుగా అమ్డాపూర్ లో కొనసాగుతున్న బాబాజీ మసాలా కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోవాలి
- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
గత కొన్నేండ్లుగా కనీసం కంపెనీ బోర్డు కూడా పెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ లో కొనసాగుతున్న బాబాజీ మసాలా కంపెనీపై అధికారుల చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మొయినాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో వలస కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కార్యక్రమంలో భాగంగా అమ్డాపూర్ గ్రామంలో గల బాబాజీ మసాలా కంపెనీలో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. మొయినాబాద్ మండల పరిధి లోని అమ్డాపూర్ రెవెన్యూలో నడుస్తున్న బాబాజీ మసాలా కంపెనీ యాజమాన్యం వలస కార్మికుల శ్రమను దోచుకుంటుందని, కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ ముందు కనీసం కంపెనీ పేరుతో కూడిన సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో 12 నుంచి 14 గంటలు పనిచేయిస్తున్నారని. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టానికి వ్యతిరేకంగా బాబాజీ మసాలా కంపెనీ వలస కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు.
మైగ్రేంట్ వర్కర్స్ చట్టం ప్రకారం కార్మికులకు అన్ని వసతులు కల్పించకుండా కొనసాగుతున్న బాబాజీ మసాలా కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు కాంట్రాక్టు లేబర్ చట్ట ప్రకారం ఎనిమిది గంటలకు రూ.16,500, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, నివాస ప్రాంతంలో పరిశుభ్రత తదితర సమస్యలన్నీ పరిష్కారం చేసేలా రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు మొయినాబాద్ మండల ఉపాధ్యక్షులు ముంజగల ప్రభుదాస్, తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.