మహిళా దక్షతా సమితి బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
చందానగర్ గంగారంలోని మహిళా దక్షతా సమితి క్యాంపస్ లో బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 4వ బీఎస్సీ నర్సింగ్ బ్యాచ్‌కి స్నాతకోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, నర్సుల సేవను సమాజానికి అదృశ్య శక్తిగా వర్ణిస్తూ, “మీరు డిగ్రీలు పొందడమే కాక, బాధ్యతలు స్వీకరిస్తున్నారు” అని అభినందించారు. ఈ వేడుకలో ఐపీఎస్ అధికారి అభిలాషా బిస్త్, వసుధ ఫార్మా కెమ్ సీఎండీ మంతెన వెంకట రామరాజు, తపాడియా డయాగ్నస్టిక్స్ ఎండీ డాక్టర్ మహేష్ తపాడియా తదితరులు పాల్గొన్నారు. “నర్సింగ్ ఒక ఉద్యోగం కాదు – అది సేవారూపి దైవ కార్యం” అని అభిలాషా బిస్త్ వ్యాఖ్యానించగా, డా. తపాడియా “నర్సులు నిశ్శబ్ద సైనికులు” అని ప్రశంసించారు.
మహిళా దక్షతా సమితి అధ్యక్షురాలు డా. సరోజ్ బజాజ్ మాట్లాడుతూ.. 1991లో ప్రారంభమైన సంస్థలో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా యువతులు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారని తెలిపారు. దాతలు సజ్జన్ కుమార్ గోయెంకా, అరుణా మాలిని తదితరుల మద్దతుతో నిర్మలా గోయెంకా హాస్టల్, ఆడిటోరియం నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, అతిథులు పాల్గొన్నారు. గూగుల్, ఇన్ఫోసిస్, బ్రాడ్‌రిడ్జ్ వంటి సంస్థల మద్దతుతో ఎండీఎస్ సంస్థ తన లక్ష్యాలను సాధించడంలో ముందంజలో ఉందని నిర్వాహకులు తెలిపారు. పట్టభద్రులు భావోద్వేగంతో డిగ్రీలు స్వీకరించగా, విద్యా ప్రస్థానం ముగిసిన ఆనందం, సేవా సంకల్పంతో భవిష్యత్తును స్వాగతించారు.