- భవిష్యత్ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం
- దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం
- సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి
పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యంలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ’ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్’ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దీనికి ’రుద్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. శనివారం ’కార్గిల్ విజయ్ దివస్ ’ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రుద్ర ఏర్పాటును ప్రస్తావించారు. భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది వెల్లడించారు. పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన దళం ఇదని వెల్లడించారు. అన్ని దళాలకు ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. సరిహద్దులోని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు భైరవ్ అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా.. ఇప్పటికే రెండు పదాతిదళ బ్రిగేడ్‌లు రుద్రలో భాగమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈసందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ఆయన మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చామన్నారు. దేశ ప్రజల విశ్వాసం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఇది సాధ్యమైందన్నారు. మన ఐక్యత, సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి ఇది సరైన సమాధానం చెప్పిందన్నారు. పాక్‌లోని ఉగ్రమూకల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ దుందుడుకు చర్యలను కూడా అరికట్టామన్నారు. భారత్ నిర్ణయాత్మకమైన విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. 1999 మే జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రు సైన్యాలు కార్గిల్‌లో ఖాళీగా ఉన్న కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం ’ఆపరేషన్ విజయ్’ను ప్రారంభించి.. ఎదురుదాడి చేసి స్థావరాలను తిరిగి సొంతం చేసుకుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు.