సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ
మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు బలగాలకు ఆధునిక సాంకేతికతను జోడించాలనే లక్ష్యంతో, మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో, సైబర్ నేరాల విచారణలో ఏఐ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ శిక్షణలో వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ ఏఐ, డిజిటల్ నిపుణులు నికీలు గుండ, పోలీసు సిబ్బందికి పలు కీలక అంశాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించారు. డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడం, ఫిషింగ్ స్కామ్‌లను విశ్లేషించడం, వాయిస్ రికగ్నిషన్, డార్క్ వెబ్ మానిటరింగ్, సోషల్ మీడియా అనాలిసిస్ వంటి ఆధునిక టెక్నిక్‌లను ఉపయోగించి నేరాలను ఎలా ఛేదించవచ్చో ఆయన ప్రాక్టికల్ డెమోలతో వివరించారు. ఏఐ ఆధారిత సైబర్ క్రైమ్ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. డీఎస్పీ లక్ష్మణ్, ఇన్‌స్పెక్టర్లు కిరణ్, రవి, ఎన్. చంద్రశేఖర్ ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ, “నేటి యుగంలో పోలీసులకు కేవలం శౌర్య పరాక్రమాలే కాకుండా, సాంకేతిక నైపుణ్యం కూడా అత్యవసరం. ఏఐ వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా, కేసులను మరింత వేగంగా, కచ్చితత్వంతో పరిష్కరించే అవకాశం ఉంటుంది,” అని పేర్కొన్నారు. అనంతరం శిక్షకులు నికీలు గుండ మాట్లాడుతూ, “టెక్నాలజీ పోలీసులకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఆ ఆయుధాన్ని ఎలా సమర్థవంతంగా ప్రయోగించాలో నేర్పించడమే నా లక్ష్యం,” అని తెలిపారు.

ఈ శిక్షణలో పాల్గొన్న పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఐ టెక్నాలజీపై తమకు కొత్త దృక్పథం ఏర్పడిందని, క్షేత్రస్థాయిలో సైబర్ నేరాల విచారణకు ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.