- ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
- మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
- రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
- మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువే
- యథేచ్చగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు
- అయినా పటిష్ట చర్యటు చేపట్టని తెలంగాణ ప్రభుత్వం
- రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి జరిమానాలతోనే సరి
దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.ఇటీవల జరిపిన సర్వేలో రోజుకు సగటున 16 మంది మృతి చెందుతున్నట్లు తేలింది. వీటిల్లో అధిక మరణాలు అతి వేగం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ప్రమాదాల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, లెర్నర్ లైసెన్స్ ఉన్నవారు వాహనాలు నడపడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్‌బంక్‌కి వస్తే వారికి ఇంధనం ఇవ్వకండి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానున్నదని అధికారులు ప్రకటించారు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే ఆ జిల్లా అధికారులు ద్విచక్ర వాహనదారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్టులు ధరించేలా ఆదేశాలు జారీ చేశారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌లకి వస్తే వారికి ఇంధనం ఇవ్వకుండా నిరాకరించనున్నటు ఇండోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులకు ఇంధనం అందించకుండా నిరాకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఆ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత పెట్రోల్ బంక్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక సంబంధిత బంక్ యజమానులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించవచ్చని నిబంధనల్లో తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఈ విధానం అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో…
తెలంగాణ రాష్ట్రంలో కూడ రోడ్డు ప్రమాదాలు అధికంగానే జరుగుతుండడం ఆందోళనకరమైన విషయం. అధిక వేగం, వాహనదారులు రాంగ్ రూట్ రావడం, ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు, అంతకు మించి కూర్చొని వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం, పరధ్యానం మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించకపోవడం వంటి ఇతర అంశాలు కూడా ప్రమాదాలకు దోహదం చేస్తాయి. ఇటీవలనే చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు. అలాగే షాద్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి 2024వ సంవత్సరం వరకు రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే.. 2020లో 19,164 మంది, 2021లో 21,315 మంది, 2022లో 21,619 మంది, 2023లో 22,903 మంది, 2024లో 25,934 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఎంత పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోతోంది. పోలీస్, ట్రాఫిక్ పోలీసు శాఖల ఉన్నతాధికారులు, పోలీసులు తదితరులు రోడ్డు నియమ నిబంధనలపై వాహనదారులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం, ర్యాలీలు, ప్రదర్శనలతో అవగాహన కల్పించడంలాంటివి చేపడుతున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. కొన్ని జిల్లాలో బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా యాక్సిడెంట్లు జరుగుతునే ఉన్నాయి.
వాహనదారులు కూడా తమ బాధ్యతను మర్చిపోవడం కూడా రోడ్డు ప్రమాదాలు సంభవించడానికి ఒక కారణం అవుతుంది. వాహనదారులు కూడా యథేచ్చగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదు. ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండగానే ఒకే టూ వీలర్‌పై హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లడం, ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు లేదా నలుగురు కూడా వెళ్తున్న సంఘటనలు సర్వ సాధారణం అయ్యాయి. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా జరిమానాలే కదా వేసేది అని వాహనదారులు భావిస్తున్నారు.ఈ మధ్యకాలంలో నగర శివారు ప్రాంతాల్లో బైక్ రైడ్‌లు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో ఒక్కోసారి హెల్మెట్ లేకుండా, పెద్ద శబ్ధంతో బైక్‌లను నడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్, సీట్ బెల్టులు ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డుపై నడిచేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి.ట్రాఫిక్ సిగ్నల్స్, గుర్తులు, మరియు సూచనలను ఎల్లప్పుడూ పాటించాలి. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ మరియు ఇతర భద్రతా పరికరాలను ధరించడం చాలా ముఖ్యం.
అలాగే, ప్రయాణీకులు సీట్ బెల్టులు ధరించాలి. మద్యం సేవించడం వలన ఏకాగ్రత తగ్గుతుంది మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వేగ పరిమితులను పాటించాలి మరియు అవసరమైన దానికంటే ఎక్కువ వేగంతో వాహనాలను నడపకూడదు. అలాగే మీ ముందున్న వాహనానికి చాలా దగ్గరగా వెళ్ళడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి తగినంత దూరం పాటించాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు.