అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి
ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత చేరువ చేయాలనే దృక్పథంతో గౌహతిలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌహతిలో ఆలయ నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ సీఎంకు టీటీడీ చైర్మన్ విన్నవించారు. దీనిపై తక్షణమే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భూమి కేటాయింపుతో గౌహతిలో అత్యంత వైభవంగా శ్రీవారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరుగుతోందని టీటీడీ చైర్మన్ తెలిపారు. హిందూ మత ధర్మ పరిరక్షణకు ఈ ఆలయం సాక్ష్యం కాబోతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “హిందూ సాంప్రదాయాల ప్రచారానికి ఇది గొప్ప అవకాశం. టీటీడీ ఆధ్వర్యంలో గౌహతిలో నిర్మించబడే ఈ ఆలయం, ఈశాన్య రాష్ట్రాల్లోని భక్తులకు శ్రీవారి దర్శనాన్ని చేరువ చేస్తుంది. శ్రీవారి అనుగ్రహం మన రాష్ట్రానికే కాక, దేశమంతటికీ కాపురమవుతుంది” అని అన్నారు. ఆలయ నిర్మాణ యజ్ఞం విజయవంతంగా సాగేందుకు అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డా. జీవీఆర్ శాస్త్రి కీలకంగా మధ్యవర్తిత్వం నిర్వహించారని సమాచారం. గౌహతిలో టీటీడీ నిర్మించే ఈ ఆలయం భక్తులకు ఒక విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందని అన్ని వర్గాల ఆశాభావం.