- చట్ట విరుద్ధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్లు..
- పనిచేయకున్నా ప్రమోషన్లు ఇస్తారా..?
- రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న వి.లచ్చిరెడ్డి
- అనేక పెండింగ్ కేసులు ఉన్నా.. అక్రమ దారిలో పదోన్నతులు
- 1500 రోజులు పరారీలో ఉన్నోడికి…కోటి రూపాయల జీతం ఎలా..?
- విజిలెన్స్ డీజీతో విచారణ చేయించండి…ఆధారాలతో సహా నిరూపిస్తాం..
- సవాల్ చేసిన బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఏదైనా సాధ్యం అవుతుంది.. ఒక ప్రభుత్వ ఉద్యోగి దీర్ఘకాలం పరారీలో ఉండి కూడా కోటి రూపాయల వేతనంతో తిరిగి విధుల్లో నియమించి బడ్డాడు అంటే అర్ధం ఏమిటి..? పలుకుబడి వున్నవారికి చట్టాలు, నియమ నిబంధనలు వర్తించవు అనేగా.. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు వెలుగు చూసింది.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ పొందిన లచ్చిరెడ్డి అనే అధికారి అవినీతి చరిత్ర చూస్తే కంపరం కలుగక మానదు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 29 జులై 07-2025 నాడు ఇచ్చిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందిన వి. లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు నాలుగేళ్లకు పైగా పరారీలో ఉన్న వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా సుమారు కోటి రూపాయల ప్రభుత్వ జీతం చెల్లించడమే కాకుండా అక్రమంగా ప్రమోషన్ ఎలా ఇచ్చారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్లలో కేవలం వి.లచ్చిరెడ్డి అనే ఒక చీడ పురుగు తాను యూనియన్ నాయకుడినని చెప్పుకుంటూ సి.సి.ఎల్.ఏ.ను అడ్డా చేసుకొని వివిధ సెక్షన్లలో వున్న ఉద్యోగులు రాంబాబు ఈయన సి సి ఎల్ ఏ సూపరింటెండెంట్ అదేవిధంగా సెక్రెటేరియేట్ సెక్షన్ ఆఫీసర్ వేణులతో కుమ్మక్కై తనకు ప్రమోషన్ వచ్చేందుకు తన ముందు వున్న అర్హులను తప్పించి, ఏ మాత్రం అర్హత లేని తాను చట్టవిరుద్ధంగా ప్రమోషన్ తీసుకున్నాడని యుగంధర్ గౌడ్ తీవ్రంగా ఆరోపించారు.
2019 అక్టోబరులో కీసర ఆర్డీఓగా లచ్చిరెడ్డిని గత ప్రభుత్వం బదిలీ చేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టరుగా భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేస్తే ఆ పోస్టింగ్ ను తీరస్కరిస్తూ విధుల్లో చేరకుండా బయట వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. శంషాబాద్ మండలంలో తహసీల్దారుగా వుండి అక్కడి నుండి బదిలీ ఐన తరువాత కూడ పాత తేదీలతో ఆర్డర్స్ ఇచ్చినందుకు (దీనిపై అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీఓ సుందర్ అబ్నర్ కూడా విచారణ చేసి నిజమే అని రిపోర్ట్ కూడా ఇచ్చాడు) రంగారెడ్డి కలెక్టరేట్ లో నమోదైన కేసు పెండింగ్ లో వున్నదని అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లచ్చిరెడ్డి రాజీనామాను తిరస్కరిస్తే.. ఉద్యోగంలో రిపోర్ట్ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా బయట వివిధ వ్యాపారాలు చేసుకున్నాడు.
2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయగా…ఎలాంటి విచారణ చేయకుండానే సుమారుగా 4 సంవత్సరాల రెండు నెలలు సెలవులో ఉన్న అతనికి పీడీ సి.ఎం.ఆర్.ఓ. గా సి.సి.ఎల్.ఏ.లో పోస్టింగ్ ఇవ్వడం చట్టవిరుద్దo. అలాంటి వ్యక్తికి నిబందనలకి వ్యతిరేకంగా తన సెలవు కాలాన్ని రెగ్యులరైజ్ చేసి పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి సుమారుగా కోటి రూపాయలు జీతం చెల్లించటం దారుణమన్నారు.
మళ్లీ అలాంటి వ్యక్తికి 29 జులై 2025 నాడు స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టరుగా ప్రమోషన్ ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. సహజంగా ఒక ఉద్యోగికి గరిష్టంగా 300 రోజులు ఈ ఆర్జిత సెలవులు, 20 ఏళ్ల సర్వీసు వుంటే 400 ఆఫ్ పే లీవ్స్ ఉంటాయన్నారు. ఒక ఉద్యోగి గరిష్టoగా 300+200=500 సెలవులను మాత్రమే ఉపయోగించి జీతం తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఏకబిగిన లచ్చిరెడ్డికి సుమారు 1500 రోజులు ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇవ్వటమే కాకుండా వెంటనే ప్రమోషన్ కూడా ఇచ్చిందన్నారు.

వాస్తవంగా ఇలాంటి కేసులో సీనియారిటీలో అప్పటికే ఆ కేడర్లో పని చేస్తున్న అందరి కన్నా చివరలో పెట్టాలి.. కానీ లచ్చిరెడ్డి మాత్రం పరారీలో ఉండి నాలుగేళ్లు వ్యాపారం చేసుకుని మళ్లీ వచ్చి ఉద్యోగంలో చేరి అక్రమంగా, చట్టవిరుద్ధంగా సుమారు కోటి రూపాయల జీతం తీసుకున్నాడని మండిపడ్డారు. పైగా తనపై కేసులు పెండింగ్ లో ఉన్నా అతడికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టరుగా ప్రమోషన్ ఇవ్వడం అధికారుల తప్పిదమన్నారు. అసలు ఏదైన చిన్న తప్పు చేస్తే పెద్ద పెద్ద శిక్ష లు వేసే అధికారులు, ఎలాంటి నిబంధనలు పాటించకుండా… ఏ మాత్రం అర్హత లేని వ్యక్తికి ప్రమోషన్లు ఇచ్చి అర్హులకు అన్యాయం చేయడమేంటని ప్రశ్నించారు. అదే విదంగా గడిచిన ఏడాదిన్నర గా సి.సి.ఎల్.ఏ.ను అడ్డాగా చేసుకొని ఎలాంటి డ్యూటీ చేయకుండా సంఘ నాయకుడిగా చలామణి అవుతూ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని తహశీల్దార్లకు ఫోన్లు చేసి బెదిరిస్తూ, తను ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి చాలా దగ్గర అని ఒక వేళ తన మాట వినకుంటే బదిలీ చేయిస్తా అంటూ వారిని బెదిరిస్తూ రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నాడని పలు ఆరోపణలు అతనిపై ఉన్నాయన్నారు.
అయ్యగారి ఆగడాలు అన్ని.. ఇన్ని కావు.. గతంలో విత్తనాల కంపెనీ పెట్టి ఎంతోమంది రైతులను మోసం చేసి, మా సంస్థ విత్తనాలు కొనుగోలు చేయాలని, అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో బుదేర గ్రామంలో రూ. 800 కోట్ల కెమికల్ కంపెనీలో ఈయన వాటా ఎంత..? మరీ ఈయనగారు ఓ జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గతంలో ప్రయత్నం చేశారు.. మళ్లీ ఇప్పుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిస్తున్నాయి..
లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డిజి చే విచారణ జరిపి, అతనిపై చర్యలు తీసుకుని, మూడు రోజుల కిందట ఇచ్చిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్లను పున: పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు బడేసాబ్, వివి గౌడ్, గాలిగల్ల సాయిబాబా, సయ్యద్ గూడూషా, గోటూరి రవీందర్ గౌడ్, బత్తుల జితేందర్, అంజన్న యాదవ్, దివాకర్ గౌడ్, నరసింహ యాదవ్, రేనట్ల మల్లేష్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్ తదితరులు పాల్గొన్నారు..