- బోగస్ బిల్లుల తయారీలో బిజీ.. బిజీ..
- ఆడిట్ కు సైతం డుమ్మా..
- పైగా సహోద్యోగుల బ్లాక్ మెయిలింగ్..
ప్రతి వ్యక్తి కి గౌరవం ఇచ్చేది చదువు.. ఆ చదువు ను పంచిపెట్టేది పాఠశాల.. మరి ఆ పాఠశాల అవినీతి పరుల నిర్లక్ష్యపు కౌగిలిలో నలిగి పోతుంటే బావి పౌరుల భవితవ్యానికి భరోసా ఎక్కడ దొరుకుతుంది.. చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల పురోభివృద్ధిని కాంక్షించి కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాల ను పిఎంశ్రీ పథకం కింద రెండో విడతలో ఎంపిక చేసింది.అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి గాను రూ.6,73,190 లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.దీంతో కాసుల మీద కన్నేసినా ప్రధానోపాధ్యాయురాలు సొంత ఎజెండాతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను దారి మళ్లించారు.

ఎవరికీ తెలియనంత వరకు బాగానే ఉంది.కానీ ‘నిధులు గుటకాయస్వాహా..!విధులకు ఎగనామం..!’ అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ గురువారం ప్రచురించి వెలుగులోకి తెచ్చింది.అయినా సరే ఈ అవినీతి బిగ్ మేడమ్ (ప్రధానోపాధ్యాయురాలు) తీరు మార్చుకోక పోగా తనను ఎవరు ఏమి చేయలేరన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం.ఇంత జరుగుతున్నా నవ్వి పోదురు గాక నాకేటి..అన్నట్లుగా మళ్లీ పాఠశాల విధులకు గురువారం కూడా డుమ్మా కొట్టింది.రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష మరియు పిఎంశ్రీ పథకాల ద్వారా నిధులు పొందిన అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పొరపాట్లకు తావులేకుండా 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఆర్థిక పరమైన అన్ని రికార్డులను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆడిట్ చేయించాల్సి ఉంది.

అంతేకాకుండా ఎవరికైనా ప్రధానోపాధ్యాయులు సెలవు లో వెళ్ళినా ఇతర కారణాలతో వీలు పడకపోయినా ఇంచార్జి ఉపాధ్యాయులను విధిగా ఆడిట్ కు పంపించాలన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ చిట్యాల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లో చిట్యాల ఉన్నత పాఠశాల మినహా మండలంలోని అన్ని పాఠశాలల ఆడిట్ పూర్తయ్యింది.అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుమతి లేకుండా ఒక వైపు పాఠశాలకు గైర్హాజరయ్యి మరో వైపు ఆడిట్ కు కూడా వెళ్లకపోవడం అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.ఈమె తో పాటు మరొక స్కూల్ అసిస్టెంట్ ఎం.సౌమ్య కూడా పాఠశాల విధులకు గైర్హాజరయి ప్రధానోపాధ్యాయులతో పాటు నిధుల లెక్కలకు బిల్లులు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారని విశ్వసనీయ సమాచారం.నిధులను పాఠశాల పురోభివృద్ధికి వినియోగించనందున బోగస్ బిల్లులు తయారు చేసే పనిలో వీరు బిజీగా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే బడికి డుమ్మా కొట్టిన వీరికి ‘ఆన్ డ్యూటీ ‘ సౌకర్యం ఇస్తే ఈ అవినీతి బాగోతానికి అధికారుల అండదండలు బారీగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది.అయినా సరే చిట్యాల స్కూల్ ఆడిట్ పూర్తి కాలేదని అసలు నేరుగా తమను కలవలేదని ఆడిట్ అధికారి పేర్కొన్నారు.సంఘర్షణ సైకిల్ యాత్ర లో భాగంగా చిట్యాల చేరుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల స్థితి గతులను పరిశీలించి ఆవేదన తో ఆందోళన కు దిగిన విషయం తెలిసిందే.చిట్యాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవిని సస్పెండ్ చేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయించి పాఠశాల నిధులను రికవరీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు ఆకారపు నరేష్,కమ్మంపాటి శంకర్ లు సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

‘గురువింద నీతి’
చిట్యాల పిఎంశ్రీ ఉన్నత పాఠశాల నిధుల దుర్వినియోగంపై నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి మాత్రం గురువింద నీతిని ప్రదర్శిస్తున్నారు.పాఠశాల గుట్టురట్టు చేసిన వారిని వదిలిపెట్టేది లేదంటూ చిర్రుబుర్రులాడుతున్నారని తెలుస్తోంది.పైపెచ్చు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అవాకులు చెవాకులతో పోలీసులకు ఫోన్ చేయటం వారి అవినీతి కి అద్దం పడుతోంది.ఈ నిధుల దుర్వినియోగంలో ఒకరిద్దరు పాఠశాల ఉపాధ్యాయుల ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు.సదరు పాఠశాల హెడ్ మాస్టర్ కాంప్లెక్స్ పరిధిలోని ఒకరిద్దరి ఉపాధ్యాయుల మెడికల్ బిల్స్ విషయంలో కూడా అతిగా స్పందించి వారికి ఖర్చు చేసిన సొమ్ము రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

ప్రధానోపాధ్యాయురాలి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన మా నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేసిన హెచ్ఎం…

ఉన్నప్పుడు రావాలి.. : గోగికార్ మాధవి, ప్రధానోపాధ్యాయులు
ఆరోపణలపై వివరణ కోరగా.. తాను పాఠశాల విధుల్లో ఉన్నప్పుడు బడి కి రావాలి తప్ప ఇష్టానుసారం వార్తలు రాయటం ఏమిటి? పాఠశాలకు వచ్చి ఫోటోలు తీసారా ? అనుమతి ఎవరు ఇచ్చారు?.. అంటూ ఆవేశంతో ఊగిపోయారు.

హెచ్ఎం పై చర్యలు తప్పవు : డీఇఓ బొల్లారం భిక్షపతి
చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి పై త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ బొల్లారం భిక్షపతి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి కి తెలిపారు. ఆమె పై అనేక ఆరోపణలు ఉన్నాయని వాటన్నింటి పైన విచారణ జరిపి కలెక్టర్ గారి అనుమతి తో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.