సిరిసిల్ల చేనేతకారుడు నల్లా విజయ్ అద్భుతం
దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కోసం మరోసారి తన అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్కరించారు సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్. ఇటీవల ఇండియన్ ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” పేరిట ఆయన చేనేత మగ్గంపై ఓ అద్భుతాన్ని సృష్టించారు. సైనికుల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ, విజయ్.. బంగారు నూలుతో అగ్గిపెట్టెలో పెట్టుకునేంత చిన్నదైన శాలువాను తయారుచేశారు. ఈ శాలువా పూర్తిగా చేనేత మగ్గంపైనే రూపొందించబడింది. బంగారంతో అల్లిన ఈ శాలువా రూపకల్పనకు విజయ్ ఎంతో శ్రమించి, దేశభక్తిని చాటుకున్నాడు.

ఇది తొలి సందర్భం కాదు. గతంలో 66వ గణతంత్ర వేడుకలకు విచ్చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు, నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేకమైన చేనేత చీరను బహుమతిగా అందించారు. ఆ సమయంలో ఆయన పనితనానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. నల్లా విజయ్ తయారు చేసిన ఈ బంగారు శాలువా ద్వారా దేశ రక్షకుల పట్ల ఆయన చూపించిన గౌరవం, చేనేత కళ పట్ల ఆయనకున్న అంకితభావం మళ్లీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని శాలువాతో స్మరించదగ్గ క్షణంగా మార్చిన ఈ చేనేత కళాకారుడు దేశంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.