- రైతులు ఆర్థికంగా లబ్ది పొందాలన్నదే నా లక్ష్యం
- వీరాయపాలెంలో ’అన్నదాత సుఖీభవ’ ప్రారంభించిన చంద్రబాబు
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రైతు రాజుగా మారాలి. ఎన్ని కష్టాలు ఉన్నా.. ప్రజలు సుఖసంతోషాల తో ఉండాలనేది నా ఆకాంక్ష. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పథకాలతో పేదలను గట్టెక్కించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ’అన్నదాత సుఖీభవ’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం.. పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం.. వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ’అన్నదాత సుఖీభవ’ ద్వారా లబ్ధి పొందనున్నారు.

మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం ’పీఎం కిసాన్’ పథకం కింద మొదటి విడతగా రూ.2 వేల చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7 వేలు చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం వితంతు పింఛన్లు రద్దు చేసింది. మా ప్రభుత్వం రాగానే వితంతు పింఛన్లు మళ్లీ తీసుకొచ్చాం. లబ్ధిదారులు ఎక్కడుంటే.. అక్కడే పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏడాదికి తెలంగాణ రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఏపీ రూ.32వేల కోట్లు వెచ్చిస్తోంది. ఆగస్టు 15 నుంచి స్త్రీశ్రక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతో దాదాపు రూ.2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారని సీఎం వివరించారు.

ఎన్నికల ముందు అరాచక, దుర్మార్గపు పాలన నడిచింది. 2019లో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు వివరించారు. ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెదేపా అన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై పాలన సాగిస్తున్నామని అన్నారు. కేంద్రంలో భాజపా నాలుగోసారి కూడా అధికారంలోకి వస్తుందని, మోడీ పనితనమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోడీ హవా పెరుగుతోందన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
