వారణాసి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. అంటే, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అంతకుముందు, జూన్ 18, 2024న, ప్రధానమంత్రి మోదీ నుంచి రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారు.
వారణాసి పర్యటనలో భాగంగా మోదీ దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు సహా రకరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వారణాసి ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుచనున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచబోతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఈ కర్యక్రమంలో సిఎం యోగి తదితరులు పాల్గొన్నారు.