Monday, August 4, 2025
spot_img

కాపాడమంటున్న సర్కారు బడి

Must Read
  • హెచ్ఎం మాధవి అవినీతిని వెలికి తీసిన ఆదాబ్ హైదరాబాద్
  • స్పందించని అధికారులపై పేరెంట్స్ ఆగ్రహం..
  • సామాజిక మాధ్యమాల్లో చర్యల కోసం జోరుగా చర్చ..

కదలమంటున్నది.. చదువు నేర్పిన నేల నిన్ను పరుగుపరుగునా…
కాపాడమన్నది.. సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోన…
కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్న…
నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యాలు మరవొద్దు ఈనేలనా…
అంటూ పలువురు ఆర్థ్రత తో ఆలపిస్తున్నారు. చిట్యాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి విధులకు డుమ్మా కొడుతూ, పాఠశాల నిధులను తేరగా ఆరగించిన విషయాన్ని ‘నిధులు గుటకాయస్వాహా..! విధులకుఎగనామం..!!’అనే శీర్షికతో ‘ఆదాబ్ హైదరాబాద్ ‘ బిగ్ మేడమ్ అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి నీతిమంతులైన పౌరులు గా తీర్చిదిద్దాల్సిన సోషల్ మేడమ్ ఉరఫ్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ గోగికార్ మాధవి అవినీతి ఊబిలో కూరుకుపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తోపాటు ఎందరో రాజకీయ నాయకులు మరియు కవి, విమర్శకులు మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తో పాటు మరెందరో ఉన్నతాధికారులు చదువు నేర్చుకుంది చిట్యాల పురపాలిక పరిధిలోని ఈ ఉన్నత పాఠశాలలోనే. విద్యార్థులకు సమ్మిళితమైన సదుపాయాలు కల్పిస్తూ వారి శ్రేయస్సును నిర్ధారిస్తూ సురక్షితమైన, సుసంపన్నమైన అభ్యసన వాతావరణాన్ని అందించడం తో పాటు విద్యార్థులకు మంచి భౌతిక మౌలిక సదుపాయాలు మరియు తగిన వనరులను పొందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎంశ్రీ) పథకంను అమలు చేస్తున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకం కింద రెండవ విడత లో చిట్యాల ఉన్నత పాఠశాల కూడా ఎంపిక అయింది.ఆధునిక మౌలిక సదుపాయాలతో పాఠశాలను అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని 43 పాఠశాలల్లో పిఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది.అయితే ఈ పథకం కింద చిట్యాల ఉన్నత పాఠశాల కు 2024 – 25 సంవత్సరానికి గాను రూ.6,73,190 లు మంజూరయ్యాయి.

నిరుపయోగంగా ఉన్న వాటర్ ఫిల్టర్

అయితే ఏ రకమైన తీర్మానాలు లేకుండానే హెచ్ఎం గోగికార్ మాధవి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఖర్చు చేయకుండానే నిధులు మొత్తం స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.స్కూల్ గ్రాంట్స్ కింద రూ.75 వేలు మంజూరైనా ఉపాధ్యాయులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు..బడి పిల్లల అసెంబ్లీకి మైకు సదుపాయం లేదు..తాగునీటి కోసం పిల్లలు అల్లాడుతున్నారు.అయితే న్యూస్ పేపర్ మ్యాగజైన్ ల కోసం రూ.12,600 చెలిమి కోసం రూ.4వేలు మంజూరు అయ్యాయి కానీ మ్యాగజైన్లు మరియు చెలిమి పుస్తకాల ఊసులేదు అడపాదడపా ఒక పేపర్ మాత్రం వస్తుంది.పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు హైదరాబాద్ కు ఎక్స్పోజర్ విజిట్ కి వెళ్లినప్పటికీ ప్రధానోపాధ్యాయులు కావాలని తనతో పాటు ముగ్గురు భౌన్సర్లను ప్రత్యేకంగా ఒక ఫోటోగ్రాఫర్ ను అయిదుగురు అపరిచిత వ్యక్తులను తీసుకెళ్లి సాలార్ జంగ్ గడప తొక్కించి అసెంబ్లీ షికారు పేరుతో తనకు తాను సన్మానించుకుని గోల్కొండ కోట గేటు బయటనే ఫోటోలు తీయించి చార్మినార్ జూపార్క్ కు పోకుండానే టూర్ ను మమ అనిపించటంతో పసి పిల్లలు కిమ్మనకుండా ఉండిపోయారు.

కేవలం ఫోటోలకే పరిమితమైన టూర్

అయితే ఈ హైదరాబాద్ విహారయాత్ర మొత్తం పాఠశాల కు సంబంధం లేని ఒక వ్యక్తి కనుసన్నల్లోనే సాగిందని తెలుస్తోంది.కాగా డీఇఓ గారు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన వివరణ లో సదరు వ్యక్తి ని ప్రస్తావించడం సమస్య తీవ్రత కు అద్దం పడుతోంది.ఇంకా బతుకమ్మ పండుగ కు రూ.20 వేలు,ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కు రూ.10వేలు,ఫైనాన్షియల్ లిటరసీ కోసం రూ.20 వేలు,పాఠశాల వార్షికోత్సవానికి రూ.50 వేలు,ఇలా ఇంకా చాలా నిధులు మంజూరు అయ్యాయి.సదరు ప్రధానోపాధ్యాయులు నిధులను బ్యాంకు ఖాతా నుండి డ్రా చేశారు.అయితే ఈ నిధుల వ్యయం కు సంబంధించి గత నెల 31 న చిట్యాల మండల రీసోర్స్ కేంద్రంలో జరిగిన ఆడిట్ కు పాఠశాల తరపున ఎవరూ హాజరు కాలేదని సమాచారం. పైగా సదరు హెడ్ మాస్టర్ గోగికార్ మాధవి పాఠశాల సహోపాధ్యాయురాలు ఎం.సౌమ్య కు ఆడిట్ పేరుతో ‘ఆన్ డ్యూటీ ‘ సదుపాయం కల్పించటం గమనార్హం.

నో టీచింగ్.. ఓన్లీ పవర్
ప్రస్తుతం ఎఫ్ఏసి హెచ్ఎం ఉన్న గోగికార్ మాధవి వాస్తవంగా పాఠశాల లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ కూడా.అయినప్పటికీ ఎప్పుడూ విద్యార్థులకు పాఠాలు చెప్పరని పదవ తరగతి విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి కి ఫిర్యాదు చేశారు. నో టీచింగ్..ఓన్లీ పవర్.. జస్ట్ ఫర్ ఫోటోస్.. అంటూ పిల్లలు చలోక్తులు విసురుతున్నారు. ఒక రోజు డిఇఓ ఆఫీస్, ఇంకో రోజు ఎస్టీఓ ఆఫీస్,ఒక రోజు పోస్ట్ ఆఫీసు,మరో రోజు బ్యాంకు పని..కలెక్టర్ ఆఫీస్ అని అసలు విధులకు ఆన్ డ్యూటీ పేరుతో డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది.తాజాగా జరిగిన వర్క్ అడ్జస్ట్ మెంట్ లో వీరితో పాటు ఉన్న మరొక సోషల్ సార్ ఇతర పాఠశాలకు డిప్యుటేషన్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

‘ఆవేదన..ఆగ్రహం ‘..
చిట్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సరే అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ వారిపై చర్యలు తీసుకోకపోవడం తో ఇటు తల్లిదండ్రులు అటు విద్యాభిలాషులు ఆవేదన తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .తక్షణమే చర్యలు తీసుకోవాలని తమ పిల్లల భవిత కు భరోసా ఇచ్చి చిట్యాల బడి కి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.గడిచిన ఆరేళ్లుగా ఈ బిగ్ మేడమ్ పని తీరుపై మరియు నిధుల వ్యయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

‘తాగునీటి కి గోస’:
చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిల్లల తాగు నీటి కి గోస పడుతున్నారు.ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద వాటర్ ఫిల్టర్ ను అందజేసినా నిర్వహణ లోపం వల్ల మూలన పడింది. బడి పిల్లల హాజరుశాతాన్ని మెరుగు పరుస్తూ పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్నభోజనం కాస్త ఈ పాఠశాలలో మిథ్యగా మారింది.భోజనం రుచి చూడాలన్న నెపంతో ప్రధానోపాధ్యాయులు బడికి వచ్చినప్పుడల్లా ఫుల్ గా భోజనం చేయటం చూసిన వారు ఎవరైనా ముక్కున వేలేసుకుంటున్నారు.కొందరు పిల్లలు ఇంటి నుండి భోజనం తీసుకువచ్చినా సరే వారికి సైతం వండి పెడుతున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు.అసలు మధ్యాహ్న భోజనం బాధ్యతను ఎవరికి అప్పగించలేదని తెలుస్తోంది.

‘సామాజిక మాధ్యమాల్లో రచ్చ’:
చిట్యాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అవినీతి బండారం సామాజిక మాధ్యమాల్లో మరింత రచ్చ చేస్తుంది. చిట్యాల ప్రాంతానికి సంబంధించిన పలు వాట్సాప్ గ్రూపుల్లో హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలని మన ఊరి బడి ని బతికించుకుందామని సందేశాలు పంపుతున్నారని సమాచారం. నిధుల దుర్వినియోగం తో పాటు విధుల నిర్లక్ష్యం పై జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని పలువురు వేడుకుంటున్నారు.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS