- జార్ఖండ్ ఉద్యమ నేత, మూడుసార్లు ముఖ్యమంత్రి..
- ఆదివాసీ హక్కుల పోరాటంలో చిరస్మరణీయమైన నాయకుడు
- శిబు సోరెన్ మృతి పట్ల కేసీఆర్, పలువురు రాజకీయ నేతల సంతాపం
జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించారు.
శిబు సోరెన్ మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 2005 మార్చిలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం 9 రోజులు మాత్రమే సీఎం కుర్చీలో కొనసాగారు. రెండోసారి 2008 ఆగస్టులో పదవిలోకి వచ్చి 2009 జనవరి వరకు కొనసాగారు. మూడోసారి 2009 డిసెంబర్ నుంచి 2010 మే వరకు సీఎంగా ఉన్నారు. ఆయన 2004-2006 మధ్య కేంద్ర మంత్రిగా, 6 సార్లు లోక్‌సభకు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారు. “గురు జీ”గా పిలవబడే ఆయన, రాజకీయాలకు బహిరంగ ప్రజా ఉద్యమ శైలిని అందించిన ఘనతకు పాత్రధారి.
శిబు సోరెన్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
శిబు సోరెన్ మృతిపట్ల తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జార్ఖండ్‌కే కాదు, దేశంలోని ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, ఆదివాసీ సమాజానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో హైదరాబాదులో జరిగిన తొలి సభకు ముఖ్య అతిథిగా శిబు సోరెన్‌ను ఆహ్వానించినట్లు.. శిబు సోరెన్ వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమానికి చూపిన సంఘీభావాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు.
కాగా, శిబు సోరెన్ మృతిపట్ల జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.