- సోషల్ మీడియా విలేకరులను హేళన చేయడం తగదు..
- సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం చేసిన విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో పని చేస్తున్నవారిని గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. వాటిని అవమానించడం సరికాదు. సోషల్ మీడియా విలేకరులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. వారిని హేళన చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కుటిల వ్యాఖ్యలు తెలంగాణ సమాజం సహించదు. ప్రజల ఆశయాల కోసం పని చేసే వ్యక్తుల మనోభావాలను కించపరచడాన్ని ప్రజలు సహించరు. సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా, ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న కొందరు వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వీరు విలువలతో కూడిన పాత్రికేయ వృత్తికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. జర్నలిస్టు ముసుగులో వ్యక్తిగత దూషణలకు దిగడం ఆందోళన కలిగిస్తోందంటూ విమర్శలు చేశారు. అంతేకాదు, ప్రధాన మాధ్యమాల విలేకరుల నుండి వీరిని వేరు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు.