పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. అచ్చువేల్లి గ్రామంలోని 3వ కేంద్రం (492 మంది ఓటర్లు) మరియు కొత్తపల్లె గ్రామంలోని 14వ కేంద్రం (1273 మంది ఓటర్లు)లో ఈ రోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. భారీ పోలీసు భద్రత మధ్య ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పులివెందుల స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.