మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్” ను పోలీసు విధుల్లో వినియోగించే విధానంపై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు విజయవంతంగా నిర్వహించామని కాలేజ్ ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి తెలిపారు.
ఈ శిక్షణలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఆధ్వర్యంలో నేర నియంత్రణ, భద్రతా వ్యవస్థల బలోపేతం, డిజిటల్ ఫోరెన్సిక్ పద్ధతులు, ఇంటెలిజెంట్ సర్వైలెన్స్ సిస్టమ్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ జామ్‌లను గుర్తించడం, అనుమానాస్పద కదలికలపై నిఘా, జనసమ్మర్ద ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం వంటి అంశాలను వివరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా సైబర్ నేరాలను అరికట్టడం, నేరస్తుల గుర్తింపు, అరెస్టు వంటి చర్యల్లో సహాయపడే మార్గాలను సూచించారు. సైబర్ సెక్యూరిటీ శిక్షణతో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా వినియోగించే పద్ధతులను నేర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎథికల్ హ్యాకింగ్ నిపుణుడు కె. అఖిలేష్ రావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు నిఖిల్ గుండా, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు హ్యాండ్‌రైటింగ్ నిపుణుడు మల్లికార్జున రావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి. విజయ్ కుమార్ డీఎస్సీ, ఇన్స్పెక్టర్లు కె.ఎస్. రవికుమార్, చంద్రశేఖర్, రాంబాబు, కిరణ్ కుమార్, మంజుల మరియు కాలేజ్ సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.