- టీకా యుద్ధంలో కీలక అడుగు
- ఎం.డి. పీడియాట్రిక్స్, హోప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ పి. మదన్ మోహన్
టీకా ద్వారా నివారించగల వ్యాధులపై భారత్ చేస్తున్న పోరాటంలో, పాఠశాల ప్రవేశ వయస్సులో పిల్లలకు బూస్టర్ డోస్ తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధులపై బాల్యంలో ఇచ్చిన టీకాలు మొదటి రక్షణనిస్తే, కాలక్రమేణా ఆ రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. ముఖ్యంగా పిల్లలు పాఠశాలలో ఇతరులతో ఎక్కువగా మెలిగే దశలో అంటే 4 నుండి 6 సంవత్సరాల మధ్య ఈ రక్షణను బలోపేతం చేయడం అవసరం. ఇండియన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం, డీటీపీ టీకాలు 6, 10, 14 వారాల్లో ఇవ్వాలి. 16-24 నెలల మధ్య బూస్టర్ డోస్ కూడా అందించాలి. పోలియో టీకాలు కూడా 6, 14 వారాలలో పాక్షిక మోతాదులుగా అందుతాయి. అయితే, అధ్యయనాలు చూపించినట్లు, 4 సంవత్సరాల వయస్సులో యాంటీబాడీ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.
డాక్టర్ పి. మదన్ మోహన్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్య ప్రణాళిక మొదటి సంవత్సరాలతోనే ఆగిపోకూడదు. పాఠశాల విద్య ప్రారంభం సమయంలో బూస్టర్ డోస్ వేయడం శాశ్వత రక్షణకై కీలక మైలురాయి. పోషకాహారం, అభ్యాసం, భావోద్వేగ సంసిద్ధతలతో పాటు తల్లిదండ్రుల చెక్‌లిస్ట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాలి. బూస్టర్ మోతాదులు సమయానికి అందించడం ద్వారా వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది, చికిత్స భారం తగ్గుతుంది, దేశం కష్టపడి నిర్మించిన నివారణ సంస్కృతిని బలోపేతం చేయవచ్చు అని అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధునిక కాంబినేషన్ వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇవి ఒకే మోతాదుతో బహుళ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అనేక పాఠశాలలు ఆరోగ్య, టీకా రికార్డులను నవీకరించమని తల్లిదండ్రులను కోరడం మంచి ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.