ఆధారాలు ఉంటే అఫిడవిట్ సమర్పించాలి : ఎన్నికల సంఘం
దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కఠినంగా స్పందించింది. ’ఓటు-చోరీ’ వంటి పదాలను పదేపదే ఉపయోగించడం సరైన పద్ధతి కాదని, అలాంటి అసభ్య పదజాలం తప్పుడు అభిప్రాయాలను రేకెత్తించవచ్చని ఈసీ హెచ్చరించింది.
1951-52లో మొదటి ఎన్నికల నుంచే ‘ఒక వ్యక్తి – ఒకే ఓటు’ నియమం అమల్లో ఉందని గుర్తుచేసిన ఈసీ, ఎవరైనా రెండు సార్లు ఓటు వేశారని ఆధారాలు ఉంటే, వాటిని లిఖితపూర్వక అఫిడవిట్‌తో సమర్పించాలని కోరింది. ఆధారాలు లేకుండా కోట్లాది ఓటర్లను ‘చోర్’ అని పిలవడం, లక్షలాది ఎన్నికల సిబ్బందిని అవమానించడమేనని స్పష్టం చేసింది.
ఇటీవల రాహుల్ గాంధీ, కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు దొంగిలించబడ్డాయని ఆరోపించారు. ఈసీ ఈ ఆరోపణలకు సంబంధించి రాహుల్‌ను లిఖితపూర్వక ప్రకటన ఇవ్వమని ఇప్పటికే కోరింది. అయినప్పటికీ, ఆయన ఎన్నికల సంఘంపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
ఈ వివాదంపై బిజెపి కూడా స్పందించింది. సోనియా గాంధీ పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో పేరు ఉందని ఆరోపిస్తూ, ప్రతిపక్షం ఓటమి తర్వాత నిరాశతో చేసే విమర్శలుగా బిజెపి నేతలు రవిశంకర్ ప్రసాద్, దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపారేశారు.